కులం, మతం పేరుతో చీలుస్తున్నారు : ప్రధాని

భోపాల్‌ : కులం, మతం పేరుతో ప్రతిపక్షాలు ప్రజలను చీలుస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రాష్ట్రానికి సంబంధించి రూ.19,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధాని మాట్లా డుతూ.. ప్రతిపక్షాలు అభివృద్ధిని పక్కన పెట్టి, పేదవాళ్ల భావోద్వేగాలతో ఆడుకునేవారని అన్నారు. అప్పుడు కులం పేరుతో సమాజాన్ని చీల్చేవారని, నేడు కూడా అదే చేస్తున్నారని చెప్పారు. సోమవారం బీహార్‌ ప్రభుత్వం కుల గణనపై సర్వే నివేదికను విడుదల చేసిన తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు కులం, మతం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నారు. దేశ ప్రగతిని ద్వేషించడమే వారి ఏకైక పని అని అన్నారు. మహిళలకు హక్కులు దక్కడం లేదని కాంగ్రెస్‌, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ.. కులం సాకులు చెబుతూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు.