– మణిపూర్ మారణహోమం దుర్మార్గం
– అమానవీయ సంఘటనలకు ఆజ్యం పోసింది బీజేపీనే..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘మణిపూర్‌లో గత 80 రోజులుగా మారణ హోమం జరుగుతున్నది. వందల మంది ఆదివాసీలు ఇతరులు హత్యలకు గురవుతున్నారు. మహిళలను నగంగా ఊరేగిస్తూ సామూహిక లైంగిక దాడులకు పాల్పడుతూ భారతావని సిగ్గుతో తలదించుకునే విధంగా సంఘటనలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి అమానుష ఘటనల పట్ల మీనమేషాలు లెక్కిస్తున్నాయి. శాంతిని నెలకొల్పడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. ఆ సంఘటనలకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం రాజీనామా చేయాలి’ అని గిరిజన,సామాజిక,ప్రజా సంఘాల నాయకులు, కవులు రచయితలు, సాంస్కతిక సంస్థల నేతలు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఆయా సంఘాల ఆధ్వర్యంలో మణిపూర్ మారణ హోమంపై నిరసన గళాల పేరుతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, తెలంగాణ సాహితి సంస్థ ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వర్లు, ప్రజా గాయకురాలు విమలక్క, మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు రాములు నాయక్, ప్రదేశ్ ఎరుకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రఘు ఎరుకుల, అంబేద్కర్ సంఘం జాతీయ నాయకులు శంకర్. ప్రయివేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు విజరు మాట్లాడుతూ మణిపూర్‌లో వందలకొద్దీ హత్యలు జరుగు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్న క్రమంలో ఇంటర్నెట్ సేవలు నిలిపే యాల్సి వచ్చిందని స్వయానా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఆందోళనకరనమని చెప్పారు. ఆయన అప్రజస్వామికంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రపతి, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మణిపూర్ విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గత మూడు నెల్ల నుంచి ఆ రాష్ట్రంలో మారణ హోమం జరుగుతుంటే దేశ ప్రధాని ఎన్నికల ప్రచా రం, విదేశీ టూర్లలో బిజీగా ఉన్నారు తప్ప.. అక్కడ పర్య టించి శాంతిని నెలకొల్పలేక పోయారని విమర్శించారు. కేంద్రం ప్రారంభంలోనే స్పందించి ఉంటే ఇంతటి దారుణా లు, వందల కొద్ది మరణాలు, మహిళలపై సామూహిక లైంగిక దాడులు జరిగేవి కావని గుర్తుచేశారు. కుకీ గిరిజన తెగకు సంబంధించిన ఒకరిని తల నరికి వేలాడదీశారంటే ఆ రాష్ట్రంలో ఎంతటి భయానక పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మా నాయక్, సేవాలాల్ సేన నాయకులు కళ్యాణ్ ,శీను, తెలం గాణ సాహితి సంస్థ నాయకులు మోహన్‌కృష్ణ, సలీమ, తెలంగాణ గిరిజన సంఘం హైదరాబాద్ అధ్యక్ష కార్య దర్శులు రామ్ కుమార్, ఎం బాలు నాయక్, రఘు, ఎ .కృష్ణ ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.