సంక్షోభంలో ప్రయివేటు కాలేజీలు

– 30లోపు పెండింగ్‌ ఫీజు బకాయిలు విడుదల చేయాలి
– లేకుంటే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం : టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీశ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రయివేటు జూనియర్‌, డిగ్రీ కాలేజీలు సంక్షోభంలో ఉన్నాయని తెలంగాణ ప్రయివేటు జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) అధ్యక్షులు గౌరి సతీశ్‌ అన్నారు. ఈనెల 30లోపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేకుంటే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను సకాలంలో ప్రభుత్వం విడుదల చేయకుంటే కాలేజీలు ఎలా నడుస్తాయని, విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. ప్రయివేటు జూనియర్‌ కాలేజీలకు ట్యూషన్‌ ఫీజు ప్రథమ సంవత్సరానికి రూ.1,760, ద్వితీయ సంవత్సరానికి రూ.1,940 ఉందని వివరించారు. అయితే జీవో నెంబర్‌ ఒకటి ప్రకారం ఏటా పది శాతం ఫీజును పెంచాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కానీ కాలేజీల తనిఖీ, గుర్తింపు ఫీజును మాత్రం 300 శాతం పెంచిందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లను యాజమాన్యాలు కలిసి వినతిపత్రాలను సమర్పిస్తామన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేజీ టు పీజీ విద్యాసంస్థల నేత జి రమణారెడ్డి మాట్లాడుతూ మూడు విద్యాసంవత్సరాలుగా రూ.4,200 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలున్నాయని చెప్పారు. మంత్రులు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదన్నారు. వివిధ సంక్షేమ పథకాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు మాత్రం విడుదల చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని వెంటనే విడుదల చేయకపోతే యాజమాన్యాలు, సిబ్బందిని ఏకం చేస్తామన్నారు. టీపీజేఎంఏ ప్రతినిధులు బాలకృష్ణారెడ్డి, జహీర్‌ఖాన్‌, సతీష్‌, మల్లేశం, చంద్రయ్య మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ప్రయివేటు కాలేజీలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు వర్సిటీ పరిధిలో ఎనిమిది, ఎంజీయూ పరిధిలో 20 ప్రయివేటు డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయని వివరించారు. ఏడాదికి రెండు సార్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని కోరారు. అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీజేఎంఏ నాయకులు మధుసూదన్‌రెడ్డి, పార్థసారధి, అమర్‌, ఇంద్రసేనారెడ్డి, సిద్ధేశ్వర్‌, శేఖర్‌, అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.