కర్నాటకలో ప్రయివేట్‌ వాహన యజమానుల సమ్మె విరమణ

Private vehicle owners strike called off in Karnatakaబెంగళూరు : కర్నాటకలో సోమవారం ప్రయివేట్‌ వాహన యజమానులు నిర్వహించ తలపెట్టిన ఒక రోజు సమ్మెను మధ్యాహ్ననికే విరమించారు. వాహన యజమానుల సమస్యలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్తామని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగరెడ్డి ఇచ్చిన హామీ మేరకు యజమానులు ఈ సమ్మెను విరమించారు. 36 ప్రయివేట్‌ వాహన యజమానుల సంఘాలతో ఏర్పడిన ఫెడరేషన్‌ సమ్మెకు పిలుపునిచ్చింది. ఫ్రీడం పార్క్‌ వద్ద ఆందోళన చేస్తున్న వాహన యజమానుల వద్దకు మంత్రి రామలింగ రెడ్డి చేరుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇలాంటి ప్రయివేట్‌ వాహన యజమానుల కోసం ఒక కార్పొరేషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆటోలు, ట్యాక్సీలు, ఎయిర్‌పోర్ట్‌ ట్యాక్సీలు, మిక్సి క్యాబ్స్‌, సరుకు రవాణా వాహనాలు, పాఠశాలల వాహనాలు, స్టేజ్‌ క్యారియర్లు, కాంట్రాక్ట్‌ క్యారియర్లు వంటి ప్రయివేట్‌ వాహన యజమానలు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఇలాంటి వాహనాలు రాష్ట్రంలో సుమారు 10 లక్షల వరకూ ఉంటాయని అంచనా. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుని వచ్చిన శక్తి స్కీమ్‌ను రద్దు చేయాలని ప్రయివేట్‌ వాహన యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. అన్ని యాప్‌ ఆధారిత రవాణా సేవలను పూర్తిగా నిషేధించాలని, ప్రతి డ్రైవర్‌కు రూ.10 వేల ఆర్థిక సహాయం చేయాలని, తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. బైక్‌ ట్యాక్సీలపై నిషేధం విధించాలని కోరారు. ముంబయి నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెట్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే ప్రయివేట్‌ వాహనాలు అందుబాట్లో లేక బెంగళూరు మెట్రోపాలిటన్‌ రవాణా కార్పొరేషన్‌ బస్సులో తన నివాసానికి వెళ్లారు. ఆ ఫోటోను అనిల్‌కుంబ్లే ట్వీట్‌ చేశారు.