– విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలి
– సీఐటీయూ జాతీయ సదస్సు తీర్మానం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
విద్యుత్, రైల్వే రంగాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్టు సీఐటీయూ జాతీయ సదస్సు తీర్మానించింది. మంగళవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌లో జరిగిన ఆల్ ఇండియా కన్వెన్షన్ ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణను నిలిపివేయాలని, నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌ను విరమించుకోవాలని డిమాండ్ చేసింది. ఉధృతంగా సమ్మెలు చేస్తున్న విద్యుత్ ఉద్యోగులను సదస్సు కొనియాడడంతో పాటు పోరాటానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ తీర్మానాలు ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 10 వరకు జిల్లా స్థాయి సదస్సులు నిర్వహించనున్నారు. సిఐటియుకి అనుబంధంగా ఉన్న అన్ని సంఘాలు ఇందులో భాగంగా కావాలని పిలుపు ఇచ్చారు. బ్లాక్, పంచాయతీ, గ్రామస్థాయిల్లో కూడా సదస్సులు నిర్వహిస్తామన్నారు. కరపత్రాల పంపిణీతో సహా అక్టోబర్ 25 నుండి నవంబర్ 2 వరకు విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 3న రైల్వే స్టేషన్ల వద్ద భారీ ప్రదర్శనలు నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు. సీఐటీయూ అధ్యక్షురాలు కె. హేమలత మాట్లాడు తూ విద్యుత్తు, రవాణా, వైద్యం, విద్య తదితర అంశాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలిగి ప్రైవేట్‌కు అప్పగించిందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం విధించిన లేబర్ కోడ్‌లతో సహా నిరంకుశ ధోరణిలో ముందుకు సాగుతోందని, ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే యూనియన్ల పనికి ఆటంకం కలిగిస్తూ, వర్గ పోలరైజేషన్ చేస్తూ బిజెపి సార్వత్రిక ఎన్నికల దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్‌లో మార్కెట్ ఆధారిత సంస్కరణల అన్ని ఎత్తుగడలను రద్దు చేయాలని, ”స్మార్ట్ మీటర్”ను రద్దు చేయాలని అన్నారు. ప్రజా రవాణా, ఆరోగ్యం, విద్య, ఇతర ప్రజా సేవలను బలోపేతం చేయడానికి వనరులను సమీకరించడానికి కార్పొరేట్ పన్నును మెరుగుపరచాలని, సంపద పన్నును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. టికెటింగ్, నిర్వహణ సేవలతో సహా కీలకమైన రైల్వే కార్యాచరణ ప్రైవేటీకరణ, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టరెజేషన్‌ను రద్దు చేయాలని అన్నారు. ఇండియన్ రైల్వేలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయా లని, భద్రత, నిర్వహణపై తగిన వ్యయం చేసి ప్రయాణికుల భద్రతను పెంచాలని పేర్కొన్నారు. సీఐటీయూ జాతీయ కార్యదర్శులు ఎలమరం కరీం, ఎఆర్ సింధూ, ఎం.సాయిబాబా, ఎంపి వివిధ రాష్ట్రాల నుండి సుమారు మూడు వందల యాభై మంది ప్రతినిధులు పాల్గొన్నారు.