జీపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..

– జీపి కార్మికుల పై అధికారులు, ప్రజా ప్రతినిధులు వేధింపులు ఆపాలి
– సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తాం 
– జేఏసీ జిల్లా చైర్మన్ తునికి మహేష్  డిమాండ్
నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 
తమ సమస్యలు పరిష్కరించాలనీ గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె బాట పడితే.. వారిని అధికారులు, ప్రజా ప్రతినిధులు వేధింపులకు గురిచేస్తున్నారని, కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ జిల్లా చైర్మన్ తునికి మహేష్  ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల పనులు చేస్తున్న కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని,  జీఓ నెం. 60 ప్రకారం వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. శనివారం దుబ్బాక మండల కేంద్రంలో జీపి కార్మికుల 3వ రోజు చేస్తున్న సమ్మెకు తెలంగాణ గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి తునికి మహేష్ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు కార్మికులను ఉదేశించి మాట్లాడారు.జిల్లా వ్యాప్తంగా 499 గ్రామ పంచాయతీలలో సుమారు 3000 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పని చేస్తున్నారన్నారు. వీరిలో పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్స్ వివిధ కేటగిరిలలో విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ పేద, బలహీన వర్గాలకు చెందినవారనీ, గ్రామాల్లో చెత్తా చెదారం, మానవుల, జంతువులు మళం, కుళ్ళిపోయిన జంతువుల కళేబరాలు తొలగింపు, మురికి కాలువలను శుభ్రం చేస్తూ నిత్యం మలినాలతో సహజీవనం చేస్తున్నారు.భారత రాజ్యాంగం పారిశుద్ధ్య పనులు చేస్తున్న వారికి ప్రభుత్వాలు ఉపాధి కల్పించాలని, స్థిరమైన వేతనాలు ఇవ్వాలని చెబుతున్నప్పటికీ ఆ బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయన్నారు. 2011 సం॥లో కార్మికుల నియామకం తర్వాత గడచిన 12 సం॥లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పంచాయతీలో కొత్త కార్మికులను నియమించారే తప్ప, కార్మికులకు అందరితో పాటు సమానంగా వేతనాలు ఇవ్వడం లేదనీ ఆరోపించారు. సర్పంచ్ ఇష్టారాజ్యంగా పంచాయతీలలో కొత్త కార్మికులను నియమిస్తున్నారు. అప్పటికే నియమించబడిన పాతవారి వేతనాలనే కొత్తవారికి కలిపి పంచడంతో అనేక పంచాయతీలలో అతి తక్కువ వేతనాలకు కార్మికులు పనులు చేస్తున్నారన్నారు. పంచాయతీలలో కొత్తగా కార్మికులను నియమిస్తే గ్రామ పంచాయతీ తీర్మానంతో, డి.పి.ఓ ఆమోదం తర్వాతనే ఈ నియామకాలను చేయాలని, అక్రమ నియామకాలను అరికట్టాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.51 తీసుకొచ్చి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని ప్రవేశ పెట్టిందనీ , దాంతో వివిధ రకాల  కేటగిరీలను రద్దుచేసి కలం పట్టిన కారోబార్, బిల్ కలెక్టర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందనీ,  నైపుణ్యం లేని సిబ్బందితో పనులు చేయించడంతో అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారనీ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామ పంచాయతీలకు కొత్తగా ట్రాక్టర్లు కేటాయించిన తర్వాత పంచాయితీ కార్మికులతోనే డ్రైవింగ్ చేయించడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేక పోవడంతో  ఫలితంగా ఆ కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.బిజెపి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతో అట్టహాసంగా కార్యక్రమాలను ప్రారంభించి ఫొటోలకు ఫోజులిస్తూ వాటి యాడ్స్ కొరకు వేల కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేసింది. బిజెపి 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మేస్తూ… కార్మికవర్గం ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 కోడ్లు గా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసిందనీ మండిపడ్డారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్, డైలీవేజ్ తదితర రకాల పేర్లతో ఉపాధి పొందుతున్న కార్మికుల శ్రమను యధేచ్చగా దోచుకునేందుకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం లేదు.కానీ పేదోడి కన్నీళ్ళు తుడవాల్సిన చేతులతో అరకొరగా ఉన్న విద్యా,వైద్యం తదితర సబ్సిడీలను రద్దు చేసిందన్నారు.అన్నదాతలకు కనీస మద్దతు ధరను నిర్ణయించాలన్న ఊసే మార్చిందన్నారు. ఇక డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరిస్తే…. రాష్ట్ర ప్రభుత్వ తీరు మరింత దారుణంగా ఉందన్నారు.పంచాయతీ కార్మికులతో తమకు సంబంధం లేదంటూ వివక్ష చూపుతుందనీ, పంచాయతీలకు జనాభాను బట్టి బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని, పంచాయతీరాజ్ కొత్త చట్టాన్ని రూపొందిస్తామని, గ్రామ పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేస్తామని వేతనాలు పెంచి, వారికి ప్రత్యేక తరహా నిర్ణయాత్మకమైన ఉద్యోగ భద్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కానీ అందులో ఏ ఒక్క వాగ్దానాలు ఇప్పటి వరకు  అమలుకు  నోచుకోలేదన్నారు. జీఓ నెం. 60 ప్రకారం నిర్ణయించిన వేతనాలను వర్తింపజేయలేదన్నారు.  పంచాయితీ సిబ్బందికి అడుగడుగునా వివక్షతే ఎదురైందన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికై గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జె.ఎ.సి. ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు ప్రజలు, ఇతర తరగతుల కార్మికవర్గం, ఉద్యోగులు సంఘీభావం తెలియజేసి అండగా నిలబడాలని సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. అలాగే ప్రజా ప్రతినిధులు అధికారులు కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం మానుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉవ్వెత్తున చేపడతామని తెలిపారు.ఈకార్యక్రమంలో దుబ్బాక టౌన్ కన్వీనర్ కొంపల్లి.భాస్కర్, సాదిక్, గ్రామ పంచాయతి యూనియన్ నాయకులు శ్రీనివాస్, ప్రశాంత్,కార్మికులు రవి,శ్రీకాంత్, దుర్గవ్వ,ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.