అంగన్‌వాడీలకిచ్చిన హామీలను నెరవేర్చాలి

Promises to Anganwadis should be fulfilled– సమ్మె కాలం వేతనాలను వెంటనే చెల్లించాలి : తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అంగన్‌వాడీ ఉద్యోగులకు సమ్మె కాలంలో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌ ఇచ్చిన నిర్ధిష్ట హామీలను అమలు చేయాలనీ, సమ్మె కాలం వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సునీత, పి.జయలక్ష్మి, కోశాధికారి పి.మంగ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఐసీడీఎస్‌ కమిషనర్‌ శృతికి వారు వినతిపత్రం అందజేశారు. రిటైర్మెంట్‌ డెనిఫిట్స్‌, అంగన్‌వాడీ టీచర్లకు రూ. 2 లక్షలు, ఆయాలకు రూ. 1 లక్ష, ఆసరా పెన్షన్‌ చెల్లిస్తామన్న హామీ నేటికీ నెరవేరలేదన్నారు. పీఆర్సీ వర్తింపు, మినీ అంగన్వాడీ అప్‌గ్రేడ్‌, ప్రమాదబీమా, మే నెల సెలవులు, ఆన్‌లైన్‌ యాప్‌ల సమస్య పరిష్కరిస్త మన్న వాటిలో ఒక్కటీ అమల్లోకి తేలేదన్నారు. వేతనాల పెంపుపై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామన్న ప్రస్తావనే లేదన్నారు. మంత్రుల హామీ ప్రకారం సమ్మెకాలం వేతనాలు రాకపోవడంతో బతుకమ్మ, దసరా పండుగ నేపథ్య ంలో అంగన్‌వాడీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు.