35 లిఫ్ట్‌ స్కీములకు ప్రతిపాదనలు

– ప్రభుత్వ అనుమతి తరువాతే ముందుకు : ఐడీసీ చైర్మెన్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఉన్నా కూడా ఎత్తుప్రదేశాల్లో ఉండి సాగునీరందని ఆయకట్టు కోసం 35 ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదనలు వచ్చాయనీ, వాటన్నింటినీ సీఎం కేసీఆర్‌ దష్టికి తీసుకెళ్లిన అనంతరం చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఐడీసీ) చైర్మెన్‌ పి.వేణుగోపాలాచారి ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఐడీసీ కార్యాలయంలో చైర్మెన్‌ అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఐడీసీ పరిధిలోని ఎత్తిపోతల పథకాల పురోగతి, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన పనులపై ప్రధానంగా చర్చించారు. అనంతరం చైర్మెన్‌ వేణుగోపాలాచారి మాట్లాడుతూ నాబార్డ్‌, ఏఐబీపీ, రాష్ట్ర బడ్జెట్‌ మొత్తంగా కలిపి ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌లో మొత్తంగా రూ.269.54కోట్లను ఐడీసీకి కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతం 538 ఎత్తిపోతల స్కీముల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4.69లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని చెప్పారు. అలాగే రూ.743.19కోట్లతో చేపట్టిన మరో 37 పథకాలు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆ పనులు పూర్తయితే మరో 65వేల ఎకరాలకు సాగునీరందనుందని తెలిపారు. అవి గాకుండా ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నదని గుర్తుచేశారు. అయినా పలు ప్రాంతాల్లో ఎత్తుప్రాంతాల్లో ఉన్న ఆయకట్టుకు ఆయా ప్రాజెక్టుల ద్వారా సాగునీరందని పరిస్థితి ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో ఆ గ్యాప్‌ ఆయకట్టుకు సైతం సాగునీరందించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు 35ఎత్తిపోతల స్కీములను ఐడీసీ ఎదుట ప్రతిపాదించారని వివరించారు. వాటన్నింటిపైనా సమావేశంలో చర్చించామని తెలిపారు.