అంతటా రక్షాబంధనం…

– రాజ్‌భవన్‌లో ‘రాఖీ ఫర్‌ సోల్జర్స్‌…’
– ప్రగతి భవన్‌లో సీఎంకు అక్కల ఆశీర్వాదం
– రాజకీయ, సినీ ప్రముఖుల నివాసాల్లో ఘనంగా వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాఖీ పండుగను పురస్కరించుకుని గురువారం రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు వారి వారి అక్కలు, చెల్లెళ్లు రాఖీలు కట్టి…ప్రేమానుబంధాలను చాటుకున్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ‘రాఖీ ఫర్‌ సోల్జర్స్‌’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్‌ డాక్టర్‌ తమిళి సై సౌందర రాజన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని…పలువురు సైనికాధికారులకు రాఖీలు కట్టారు. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థినీలు పాల్గొన్నారు. సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ… ఆయనకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం తన అక్కలకు పాదాభివరదనం చేసి, ఆశీర్వాదాలు పొందారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… తన సోదరుడు, రాజ్యసభ సభ్యుడు జోగినేపల్లి సంతోశ్‌కుమార్‌కు రాఖీ కట్టారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే సీతక్క రక్షాబంధనం కట్టారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు నిమ్స్‌లో అక్కడి నర్సులు, సిస్టర్లు, ఇతర మహిళా సిబ్బంది రాఖీలు కట్టారు. మహిళా సంఘాల సహాయకుల(వీవోఏ)కు వేతనాలను పెంచిన నేపథ్యంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, హరీశ్‌రావుకు ఆయా సంఘాల మహిళా నేతలు రాఖీలు కట్టి… కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్‌, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తదితరులకు వారి వారి సోదరీమణులు రాఖీలుకట్టి అభిమానాన్ని చాటారు.