మణిపూర్‌ ఘటనలపై నిరసన

 Protest against Manipur events– క్రైస్తవుల శాంతి ర్యాలీలు
– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ- విలేకరులు
మణిపూర్‌ రాష్ట్రంలో దారుణ ఘటనలు, క్రైస్తవులపై దాడులపై రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. క్రిస్టియన్లు ర్యాలీలు తీశారు. ఆ రాష్ట్రంలో శాంతిని పరిరక్షించాలని, మారణకాండను అరికట్టాలని కోరారు.
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్‌ పట్టణంలో క్రైస్తవులు నిర్వహించిన శాంతి పరిరక్షణ ర్యాలీలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కేఏ పాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మణిపూర్‌ రాష్ట్రంలో శాంతిని పరిరక్షించాలని కోరారు. దేశానికి ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని, ఆ రాష్ట్ర డీజీపీని సస్పెండ్‌ చేయాలని కోరారు. మణిపూర్‌ ఘటనలను సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్టు చెప్పారు.
మణిపూర్‌లో జరిగే మారణకాండను అరికట్టి, ప్రజల మధ్య నెలకొన్న మతాల పోరును నిలువరించి శాంతిని నెలకొల్పాలని హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ క్రిస్టియన్‌ ఫాస్టర్ల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కేవీయన్‌ జాకబ్‌ మాట్లాడుతూ.. వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకొని మణిపూర్‌ మంటలను ఆర్పడానికి కృషి చేయాలని కోరారు.
సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లిలో సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. చివ్వెంల మండలంలో మన్నా చర్చి ఫాస్టర్‌ శ్యామూల్‌ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించారు. యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి.. రాస్తారోకో నిర్వహించారు. మణిపూర్‌ అల్లర్లకు వ్యతిరేకంగా సంగారెడ్డిలో సేవ్‌ మణిపూర్‌ నినాదంతో వేలాది మంది క్రిష్టియన్ల శాంతి ర్యాలీ తీశారు