ఉపాధి హామీ పథకంపై దాడులను నిరసిస్తూ

– అక్టోబరు 11న దేశవ్యాప్తంగా ఆందోళనలు
న్యూఢిల్లీ : గ్రామీణ నిరుపేదలకు, అత్యంత అణచివేతకు గురైన వర్గాలకు జీవనోపాధి కల్పించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఏ)ను మనుగడలో లేకుండా చేసేందుకు మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లుగా కుట్రలు పన్నుతోంది. ఆ పథకంపై ప్రభుత్వం చేసే విధానపరమైన దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అక్టోబరు 11న నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రైతు, కార్మిక సంఘాలైన ఏఐకేఎస్‌, బీకేఎంయూ, ఏఐఏడబ్ల్యూయూ, ఏఐఏఆర్‌ఎల్‌ఏ, ఏఐఏకేఎస్‌యూలు పిలుపిచ్చాయి. సాధారణంగా వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కూలీల వేతనాలు క్షీణిస్తున్నా, చాలా ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద వేతనాలు మాత్రం స్ధిరంగా వుంటున్నాయి, లేదా కాస్త పెరుగుదల నమోదు అవుతున్నది. వాస్తవాలు ఇలా వున్నప్పటికీ ఈ పథకాన్ని రూపుమాపేయాలని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. వరుసగా బడ్జెట్లలో తగినంతగా నిధులు కేటాయించకుండా మోడీ ప్రభుత్వం ప్రధానంగా దారుణమైన దెబ్బ తీస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 91శాతం నిధులు కేటాయించినవి ఖర్చు పెట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ కార్మికులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. పని ప్రదేశాల్లో ఆన్‌లైన్‌ హాజరు నమోదు చేయించుకోవడం, ఆధార్‌ ప్రాతిపదికన చెల్లింపులు ఇవన్నీ పెద్ద సమస్యలుగా మారాయి. పార్లమెంట్‌లో అందచేసిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది 51891168 జాబ్‌ కార్డులను నిరాధారణమైన కారణాలతో తొలగించారు. ఇటీవలే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగే పనుల పర్యవేక్షణకు డ్రోన్‌లను ఉపయోగించాలని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దానికోసం కొత్తగా కేటాయింపులేవీ జరపకపోయినా, డ్రోన్‌ సాంకేతికతను ఉపయోగించుకోవడంలో నైపుణ్యత కలిగిన సంస్థల సేవలను అద్దెకు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను కోరారు. ప్రతిరోజూ ఉపాధి కార్మికులకు కొత్త సమస్యలు సృష్టించేందుకు ఇవన్నీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎత్తుగడలు. పథకం పట్ల ఆసక్తిని కనబరచనీయకుండా కార్మికులను నిరుత్సాహానికి గురి చేసే కుట్రలే ఇవన్నీ.