ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణంపై ఎగసిపడిన జనాగ్రహం

On Ethanol Factory Construction A rousing crowd– పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు, ప్రజలు
– దిలావర్‌పూర్‌లో ఉద్రిక్తత
– పనులు నిలిపేదాక కదలబోమంటూ బైటాయింపు
– ఫర్నిచర్‌ ధ్వంసం.. కారుకు నిప్పు
– గోడలు, గుడారాల కూల్చివేత
– పోలీసుల లాఠీచార్జి
– నేడు బంద్‌కు పిలుపు
నవతెలంగాణ-దిలావర్‌పూర్‌
నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలంలోని దిలావర్‌పూర్‌, గుండంపల్లి గ్రామాల సరిహద్దు పంటపొలాల్లో నిర్మిస్తున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమైంది. కొన్ని నెలలుగా ప్రజలు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. అయినా నాయకులు, అధికారుల్లో ఎలాంటి చలనం రాకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫ్యాక్టరీ సరిహద్దు గ్రామాల రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో బుధవారం ఆ భూముల్లోకి చొరబడ్డారు. ఫ్యాక్టరీ పనులు పూర్తిగా నిలిపేసేవరకు కదిలే ప్రసక్తే లేదని రైతులు ఫ్యాక్టరీ సమీపంలో భీష్మించుకు కూర్చున్నారు. పనులు నిలిపివేయాలని సిబ్బందిని హెచ్చరించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కార్మికులకు గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. దాంతో కార్మికులు మూటముల్లె సర్దుకుని ఇంటిదారి పట్టారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ గోడలను ఆందోళనకారులు కూల్చేశారు. ఫర్నీచర్‌ ధ్వంసం చేసి, గుడారాలను పడగొట్టారు. నిర్మాణ సామాగ్రి సెంట్రింగ్‌, ఇనుప చువ్వలను వంచేశారు. వాహనాల టైర్లలో గాలి తీసేశారు. ఫ్యాక్టరీకి సంబంధించిన కారుకు నిప్పంటించారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడి చేరుకొని ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు.
దిలావర్‌పూర్‌ బంద్‌కు పిలుపు
లాఠీచార్జిని నిరసిస్తూ రైతులు గురువారం దిలావర్‌పూర్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, పోరాటం మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు ప్రకటించారు. ప్రభుత్వం దిగొచ్చి ఫ్యాక్టరీ పనులు నిలిపే వరకు ప్రతిరోజూ నిరసన కార్యక్రమాలు చేపడతామని ఇథనాల్‌ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు తెలిపారు. గ్రామ వీధుల్లో ఇథనాల్‌ ఫ్యాక్టరీ వ్యతిరేక నినాదాలు చేస్తూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. గురువారం బంద్‌లో దుకాణ సముదాయాలు, వ్యాపార కార్యకలాపాలు స్వచ్చంధంగా నిలిపివేసేందుకు కార్యాచరణ చేశారు. బస్టాండ్‌ సమీపంలోని చర్చి పక్కన వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు కోరారు.