– ప్రజల కోసం కరెంట్ తీగలను పట్టుకునేందుకు సిద్ధం : మంత్రి కేటీఆర్‌కుకోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్టు నిరూపించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్ చూపించి, రుజువు చేస్తే కరెంట్ తీగలను పట్టుకుకునేందుకు తాము సిద్ధమని మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. రాష్ట్ర కోసం మంత్రి పదవిని వదులుకున్న వ్యక్తిని అని గుర్తు చేశారు. పార్టీలు మారితేనే పదవులిస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్‌లో టికెట్ నిర్ణయం అవుతుందనీ, వెంటనే యాదగిరి గుట్ట నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆలేరు ఇంచార్జీ బీర్ల ఐలయ్య నేతృత్వంలో బీఆర్‌ఎస్ నాయకులు కొమ్మిశెట్టి నర్సింలు, సింగిల్ విండో వైస్ చైర్మెన్ వంగాల కష్టయ్య, మాజీ సర్పంచ్ ఓంకార్ గౌడ్ తదితరులు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త సచివాలయం అవసరం లేకున్నా… వాస్తు లేదనే అపనమ్మకంతో కొత్త సచివాలయం నిర్మించారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలకు సమానంగా కాంగ్రెస్ మ్యానిఫోస్టో ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ డబ్బులతో పోటీ పడలేదు కానీ పథకాలతో పోటీ పడుతోందన్నారు. పథకాలు అమలు కాకపోతే.. నా పదవులకు రాజీనామా చేస్తానన్నారు. 60 రోజులు కష్టపడి కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆలేరులో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.
అధికార ప్రతినిధులు అప్రమత్తగా ఉండాలి : మాణిక్‌రావు ఠాక్రే
ఎన్నికల సమయంలో అధికార ప్రతినిధుల పాత్ర చాలా కీలకమని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే చెప్పారు. నిరంతరం అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. బీజేపీ, బీజేపీ అవినీతికి సంబంధించిన అన్ని అంశాలను సరైన ఆధారాలతో ప్రజలకు వివరిం చాలని సూచించారు.బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అధికార ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మీడియా కమిటీ చైర్మెన్ కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, వార్ రూమ్ ఇంచార్జ్ రోహన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల సామాజిక మద్యమాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలను, డిక్లరేషన్లు, గ్యారంటీలు ప్రజలకు చేరవేయడంలో అధికార ప్రతినిధులు విజయవంతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.