– రియల్టర్లకు ‘రెరా’ చైర్మెన్ హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ (రెరా) చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ పొందిన రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు, బిల్డర్లు సెప్టెంబర్ నెలాఖరులోగా త్రైమాసిక, వార్షిక ఆడిట్ నివేదికల్ని తప్పనిసరిగా సమర్పించాలని ఆ సంస్థ చైర్మెన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కోరారు. ప్రాజెక్టు త్రైమాసిక నివేదికను సెక్షన్ 11(1)(బీ) ప్రకారం ప్రమోటర్ లాగిన్ ద్వారా ‘రెరా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు. వార్షిక అకౌంట్ ఆడిట్ నివేదికల్ని ఏటా సెక్షన్ 4(2)(ఎల్)(డీ) ప్రకారం ప్రొవిజన్ 3 ద్వారా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కోరారు. త్రైమాసిక నివేదికలు ఏటా ఏప్రిల్ 15, జూలై 15, అక్టోబర్ 15, జనవరి 15 తేదీల్లోపు నివేదించాలని తెలిపారు. దీనికి సంబంధించి బిల్డర్లు, ప్రమోటర్లకు మెసేజ్‌లు, ఈ- మెయిల్స్, నోటీసులు పంపామని వివరించారు. త్రైమాసిక నివేదికల కోసం ఫారం – 4, 5, 6, వార్షిక నివేదికల కోసం ఫారం – 7 వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయనీ, వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏజెంట్లూ రిజిస్టర్ చేసుకోవాలి
రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా ‘రెరా’లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ సంస్థ చైర్మెన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ అబిడ్స్‌లోని ఓ హౌటల్లో యూనిక్ రియాలిటీ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 220 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు మూడు రోజుల అవగాహనా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రెరా చట్టం ప్రమోటర్లు, కొనుగోలుదారులు, ఏజెంట్ల కోసం మాత్రమే పనిచేస్తుందని స్పష్టంచేశారు. రెరాలో ఏజెంట్లుగా దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లో సిస్టం ద్వారా సర్టిఫికెట్ జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ సీఈవో సుశీల్ కుమార్, కో ఫౌండర్ వేణు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.