25న ప్రజా ఆశీర్వాద ర్యాలీ..

నవతెలంగాణ- ఆర్మూర్
నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడవసారి టికెట్ పొందిన సందర్భంగా పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికేందుకు ఆర్మూర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు సమాయత్తమవుతున్నారు. ముచ్చటగా మూడోసారి పార్టీ టికెట్ తో ఈ నెల  25వ తేదీ  ఉదయం 9 గంటలకు  హైదరాబాద్ లో బయలుదేరి ఆర్మూర్ పట్టణంలో అడుగు పెట్టనున్న జీవన్ రెడ్డికి  రెండు వేల కార్లతో, వెయ్యి బైక్ లతో అఖండ స్వాగతం పలకనున్నారు.  పెర్కిట్ హై వే బ్రిడ్జి నుంచి అంకాపూర్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వరకు బీఆర్ఎస్ శ్రేణుల ర్యాలీ జరగనుంది. ఇందు కోసం గులాబీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా జీవన్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కావడం పట్ల పార్టీలో నయా జోష్ కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోరాడి జీవనన్నకు హ్యాట్రిక్ విక్టరీని కానుకగా ఇస్తామని బీఆర్ఎస్ సైన్యం విస్పష్టం చేస్తోంది. 25వ తేదీ ప్రజా ఆశీర్వాద ర్యాలీకి ప్రజలంతా తరలి వచ్చి జీవన్ రెడ్డిని ఆశీర్వ దించాలని నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ లు, ఆర్మూర్ మునిసిపాలిటీ చైర్మన్ ఆధ్వర్యంలో మొత్తం 36 మంది వార్డు సభ్యులు ఈ ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొనాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ వారికి లేఖలు రాసింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ స్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ ,నాయకులు పండిత్ ప్రేమ్,  లింబాద్రి గౌడు ,సుంకరి రవి, జనార్ధన్ గౌడ్, మోత్కూరి లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.