– ప్రజాస్వామ్య రక్షణకు బీజేపీ కూటమిని ఓడించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్
నవతెలంగాణ-జనగామ
దేశంలో ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే బీజేపీ కూటమిని ఓడించి, వామపక్ష, లౌకిక శక్తులను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా సిద్ధెంకి గ్రామంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను ఆదరించాలని కోరుతూ నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భువనగిరి నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపాలని కోరారు. సీపీఐ(ఎం) అభ్యర్థి గెలిస్తేనే పార్లమెంట్‌లో ప్రజావాణిని వినిపించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. పార్లమెంటులో వామపక్షాల బలం తగ్గడం వల్ల ప్రజా సమస్యలు పక్కకు పోయి కార్పొరేట్లకు ఉపయోగపడే విధానాలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. పదేండ్ల బీజేపీ పాలనలో కార్పొరేట్, మతోన్మాద విధానాలు బలపడ్డాయని, వీటికి వ్యతిరేకంగా నికరంగా పోరాడింది దేశంలో వామపక్షాలే అని స్పష్టంచేశారు. వామపక్ష అభ్యర్థులు గెలిస్తే ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తేవడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ మోడల్ అని చెబుతున్న గుజరాత్‌లో కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 15 శాతానికిపైగా పేదరికం పెరిగిందని తెలిపారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఇది 30 శాతానికి పైగా ఉంటుందని అన్నారు. కానీ, కేరళలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 0.7 శాతం లోపలే పేదరికం ఉందని పేర్కొనడం, ఉపాధి, ఉద్యోగ కల్పన, మానవ అభివృద్ధి, అందరికీ నివాసం కల్పించిందని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయని అన్నారు. వ్యవసాయ కార్మికులు, రైతాంగం, కార్మికులు, కౌలు రైతులకు మేలు జరగాలంటే తిరిగి వామపక్ష అభ్యర్థులను గెలిపించుకోవడమే మార్గమని చెప్పారు. దేశంలో బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతుంటే వాటిని కేరళ ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వ రంగంలో నడుపుతున్నదని తెలిపారు. దేశంలో రైతుల నల్లచట్టాలు, నిరుద్యోగ సమస్య, నూతన జాతీయ విద్యావిధానం, కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లను, సీఏఏ లాంటి ప్రజా వ్యతిరేక చట్టాలు కార్పొరేట్ శక్తులకు ఉపయోగం కలిగేలా తీసుకొస్తే, వాటికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) పోరాడుతోందని తెలిపారు. పార్లమెంట్‌లో వామపక్ష పార్టీలు లేకపోవడం వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరిగిందో ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం మొదటి ఐదేండ్లలో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు పార్లమెంట్‌లో ఉండటం వల్ల ప్రజా అనుకూల చట్టాలు చేయించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేశారని తెలిపారు. దేశాన్ని కార్పొరేట్, మతోన్మాద విధానాలతో నష్టం చేస్తున్న బీజేపీని రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పుప్పాల శ్రీకాంత్, జనగామ జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాశ్, గ్రామశాఖ కార్యదర్శి గురిజాల లక్ష్మినర్సింహారెడ్డి, నాయకులు పుప్పాల అయిలయ్య, విప్లవ రెడ్డి, నర్సయ్య, దుబ్బాక సంపత్, రాజారెడ్డి పాల్గొన్నారు.
జహంగీర్‌ను గెలిపించండి..
సీపీఐ(ఎం), ఆవాజ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం
సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను గెలిపించాలని కోరుతూ ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణకేంద్రంలో జహంగీర్ సతీమణి ఎండీ ఖమరున్నీసా బేగం, ఆవాజ్ జిల్లా కమిటీ సభ్యులు ఎండీ రేష్మాబేగం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. 35 ఏండ్ల్లుగా జహంగీర్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషిచేస్తున్నారని తెలిపా రు. జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం 30 రోజులు పాదయాత్ర నిర్వహించారన్నారు. భువన గిరిలో ధనబలం, ప్రజాబలం మధ్య పోటీ జరుగు తుందని చెప్పారు. భువనగిరి గడ్డపై సీపీఐ(ఎం)ను గెలిపిస్తే ప్రజల పక్షాన పార్లమెంట్‌లో జహంగీర్ ప్రశ్నిస్తారని తెలిపారు. పదేండ్ల్ల బీజేపీ పాలనలో ప్రజాసమస్యలు పరిష్కరించడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి జహంగీర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎమ్‌డీ సల్మాబేగం, రజియాబేగం, అర్షియా, రహీమా పాల్గొన్నారు.