– ఇప్పటికే బిగ్‌బాస్ ఫేం అరెస్టు
– బీజేపీ ఎంపీ జగ్గేశ్, నటుడు దర్శన్‌పైనా దర్యాప్తు
బెంగళూరు : కర్నాటకలో పులిగోర్ల కలకలం రేగుతోంది. పులి గోరు ధరించినందుకు కన్నడ రియాలిటీ షో కంటెస్ట్ వర్తుర్ సంతోష్‌ను ఆదివారం సెట్‌లో నుంచే అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సంతోష్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అయితే ఈ అరెస్టు తరువాత రాష్ట్రంలో అనేక మంది ప్రముఖల దగ్గర ఇలాంటి పులిగోర్లు ఉన్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జగ్గేశ్, కన్నడ సినీ నటులు దర్శన్, జేడీఎస్ నాయకులు, నటులు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి, ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, కుణిగల్‌లోని వెంకటేశ్వర స్వామి, చిక్కమగళూరులోని వినరు గురూజీ వంటి వారి దగ్గర పులిగోర్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరు పులిగోర్లు ధరించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తాను ధరించిన పులిగోరు నకిలీ దని నిఖిల్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ఆరోపణలపై కర్నాటక అటవీ శాఖకు చెందిన ఉన్నతస్థాయి అధికారుల బృందం వివిధ ప్రాంతాల్లో విచారణ నిర్వహిస్తుంది. అలాంటి వస్తువులు ఉన్నట్లు వెల్లడయితే వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కర్నాటక పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ చట్టం ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ వర్తిస్తుందని, ప్రభుత్వం చట్టం ప్రకారం నడుస్తుందని చెప్పారు.