– యుఎస్ ట్రెజరీ సెక్యూరిటీస్ విక్రయం
ముంబయి : విదేశీ నిల్వల నిర్వహణను విస్తృత పరచడంలో భాగంగా అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఇటీవల 6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. బదులుగా ఈ ఏప్రిల్‌లో 7 బిలయన్ డాలర్ల విలువైన యుఎస్ ట్రెజరీ సెక్యూరిటీస్‌లను (యుఎస్‌టి) విక్రయించింది. భారత్ ముఖ్యంగా ఆర్‌బిఐకి చెందిన యుఎస్ ట్రెజరీ సెక్యూరిటీల విలువ ఏప్రిల్‌లో 7.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇది నెలాఖరు నాటికి యుఎస్ ట్రెజరీ సెక్యూరిటీస్ ఎక్స్పోజర్ విలువ (యుఎస్‌టిఎస్) 233.5 బిలియన్లకు చేరుకున్నట్లు యుఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ సమాచారం పేర్కొంది.
భారత్ ఏప్రిల్‌లో సుమారు ఒక బిలియన్ డాలర్ల విలువైన యుఎస్‌టిలను కొనుగోలు చేసింది, అదే సమయంలో బంగారం స్టాక్ సుమారు 794 టన్నుల వద్ద ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ డాలర్ వ్యతిరేక ఆస్తులను, బంగారాన్ని కూడబెడుతున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సెంట్రల్ బ్యాంకులకు అనుగుణంగా ఆర్‌బిఐ కూడా వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది.
విదేశీ సెంట్రల్ బ్యాంకులు యుఎస్‌టిలకు తమ ఎక్స్పోజర్‌ను 30 బిలియన్ డాలర్లకు తగ్గించినట్లు యుఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన నివేదిక తెలుపుతోంది.
మరోవైపు, సెంట్రల్ బ్యాంకులు జనవరి మార్చి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 290 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, ఈ త్రైమాసికంలో చైనా, టర్కిష్ సెంట్రల్ బ్యాంకులు అత్యధిక కొనుగోళ్లకు కారణమయ్యాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సూచీ తెలిపింది.
2017 డిసెంబర్ నుండి రిజర్వ్ బ్యాంక్ మార్కెట్ నుండి క్రమం తప్పకుండా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. అయితే ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల మధ్య గత రెండు సంవత్సరాలుగా కొనుగోళ్లను తీవ్రతరం చేసింది. ఈ ఏడాది జనవరి నుండి కొనుగోళ్లను మరింత వేగవంతం చేసింది. సెంట్రల బ్యాంక్ మేలో మరో మూడు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు క్యాలెండర్ సంవత్సరంలో 28 టన్నులకు చేరినట్లు తాజా సమాచారం తెలుపుతోంది. ద్రవ్యోల్బణం, విదేశీ నిల్వల ఇబ్బందులకు వ్యతిరేకంగా రక్షణగా, ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తుల బేస్‌కు భిన్నంగా బంగారాన్ని రిజర్వ్ చేయడం సెంట్రల్ బ్యాంక్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. బంగారం నిల్వలను పెంచుతున్నామని, వాటి సమాచారం ఎప్పటికప్పుడు విడదలవుతుందని ఏప్రిల్ 5న పోస్ట్ పాలసీ మీడియా స మావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. నిల్వలను పెంచే విషయంలో అన్ని అంశాలను అంచనా వేసి, ఆపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.