‘వరి ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలి’

నవతెలంగాణ- కందనూలు
వానాకాలం వరి ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్‌ రెవెన్యూ కే. సీతారామ రెడ్డి ఆదేశించారు. బుధవారం నాగర్‌ కర్నూల్‌ ఐడిఒసి ప్రజావాణి హాల్లో వానాకాలం ధాన్యం కొనుగోలు పై వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార సంఘం, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐ.కే.పి., పి.ఎసిఎస్‌ వరి ధాన్యం కొనుగోలు ఇంఛార్జి లు, రైస్‌ మిల్‌ అసోసియేషన్‌, వ్యవసాయ శాఖ అధికారులతో ధాన్యం కోనుగోలు పై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో త్వరలో వరి కోతలు ప్రారంభం అవుతాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. ఈసారి ఎ గ్రేడ్‌ రకం వరి క్వింటాలుకు రూ. 2203/- లు సాధారణ రకం ధాన్యానికి రూ. 2183/- ఇవ్వడం జరిగిందన్నారు. వానాకాలం సాగు ద్వారా జిల్లాలో 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేయడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అయితే ఇవి అవసరాన్ని బట్టి ప్రారంభించుకోవడం జరుగు తుందన్నారు. ఐ.కే.పి. ద్వారా 12 సహకార సంఘం ద్వారా 204 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా గ్రామీణా భివద్ధి శాఖ అధికారి నర్సింగ్‌ రావు, వ్యవసాయ శాఖ ఇంఛార్జి అధికారి చంద్రశేఖర్‌, సివిల్‌ సప్లై అధికారి స్వామి కిరణ్‌, డిసిఓ. పత్యా నాయక్‌, డి.యం. సివిల్‌ సప్లై బాలరాజు, రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రమేష్‌ బాబు, మండల వ్యవసాయ అధికారులు, ఐకేపి కేంద్రాల ఇంఛార్జిలు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు, కోఆపరేటివ్‌ శాఖ కొనుగోలు కేంద్రాల ఇంఛార్జి లు తదితరులు పాల్గొన్నారు.