– వైట్‌హౌస్ ఆమోదం కోసం వేచి వున్నామన్న క్రెమ్లిన్
మాస్కో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధంగా వున్నారు. వైట్‌హౌస్ నుండి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ శుక్రవారం తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేలా చూసేందుకు సాధ్యమైనంత త్వరలో పుతిన్‌తో భేటీ కావాలని భావిస్తున్నట్లు గురువారం దావోస్ సమావేశాల్లో మాట్లాడుతూ ట్రంప్ తెలిపారు. అణ్వాయుధాలను తగ్గించే దిశగా కృషి చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. రష్యా, చైనాలు కూడా తమ అణ్వాయుధ సామర్ధ్యాలను తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, పుతిన్ కూడా ఇదే ఆలోచనతో వున్నారని క్రెమ్లిన్ పేర్కొంది. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందుగానే పుతిన్ అభినందనలు తెలియచేస్తూ, ఉక్రెయిన్‌పై, అణ్వాయుధాలపై చర్చలకు సిద్ధమని తెలిపారు. ఇరువురు నేతలు ముఖాముఖి సమావేశం కావడానికి ముందుగా ఈ వారాంతంలో ట్రంప్, పుతిన్‌లు మాట్లాడుకునే అవకాశం వుందా అని ప్రశ్నించగా పెస్కోవ్ పై రీతిలో స్పందించారు. ‘పుతిన్ సిద్ధంగా వున్నారు, వాషింగ్టన్ నుండి సంకేతాలు కోసం ఎదురుచూస్తున్నామన్నారు. సాధ్యమైనంత త్వరలో అణు నిరాయుధీకరణపై చర్చలు పునరుద్ధరించాలని పుతిన్ కోరుకుంటున్నారని పెస్కోవ్ తెలిపారు. అయితే ఇటువంటి చర్చల పరిధి గతంలో కన్నా మరింత విస్తరించాలని, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి ఇతర అణ్వాయుధ దేశాలను కూడా కలుపుకోవాల్సి వుంటుందన్నారు. కాబట్టి ముందు మాట్లాడుకోవాల్సిన అవసరం వుంది. ఇప్పటికే అనేక రకాలుగా కాలం వృధా అయిందని పెస్కోవ్ వ్యాఖ్యానించారు.