పీవీ శ్రీనివాస్‌ ఆదర్శప్రాయులు

PV Srinivas is exemplary– తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్‌ గౌరీ శంకర్‌
– నవతెలంగాణకు పీవీ సేవలు చిరస్మరణీయం : వేణుమాధవ్‌, నవతెలంగాణ అసిస్టెంట్‌ ఎడిటర్‌
– భద్రాచలంలో పీవీ సంస్మరణ సభ
నవతెలంగాణ-భద్రాచలం
చరిత్రలో ఎవరి పేజీ వారి రాసుకుంటారని, అలా పీవీ శ్రీనివాస్‌ కూడా విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పాల్లొంటూ యువజన రంగంలో ప్రజా ఉద్యమాలను బలంగా నిర్మించి యువతకు ఆదర్శంగా నిలిచారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్‌ గౌరీ శంకర్‌ అన్నారు. నవతెలంగాణ దినపత్రిక మాజీ సీజీఎమ్‌ పీవీ శ్రీనివాస్‌ సంస్మరణ సభ ఆదివారం భద్రాచలం పట్టణంలోని కేకే ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన స్నేహితులు, అభిమానులు, పార్టీ నాయకులు, బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భద్రాచలం మాజీ జెడ్పీటీసీ గుండు శరత్‌ అధ్యక్షతన జరిగిన ఈ సంస్మరణ సభకు గౌరీ శంకర్‌ హాజరై ప్రసంగించారు. పీవీలో అనేక గొప్ప కోణాలు దాగి ఉన్నాయని, సీపీఐ(ఎం)ని ఎంతో గొప్పగా గౌరవించారని వ్యాఖ్యానించారు. 1980-90 దశాబ్దాల్లో వచ్చిన యువతకు సామాజిక స్పృహ ఎంతగానో ఉందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రజల కోసం పనిచేసే వారు ఉద్యమ భావజాలాలను కలిగి ఉంటారని, అటువంటి వారి కోవలో పీవీ శ్రీనివాస్‌ పయనం జరిగిందని, అయన్ను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
నవతెలంగాణ అసిస్టెంట్‌ ఎడిటర్‌ వేణుమాధవ్‌ మాట్లాడుతూ.. నవతెలంగాణ నిర్వహణలో పీవీ శ్రీనివాస్‌ సేవలు చిరస్మరణీయమని నవతెలంగాణ అసిస్టెంట్‌ ఎడిటర్‌ వేణుమాధవ్‌ అన్నారు. పత్రికను నిలబెట్టడంలో ఆయన సహకారం మరువలేనిదని తెలిపారు. పత్రిక ప్రారంభంలో అందులో పని చేసే స్టాఫ్‌లో చైతన్యం తీసుకొచ్చి పత్రిక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడ్డారని గుర్తుచేశారు. పత్రిక, పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారని, నిరంతరం అధ్యయనం మీదనే ఆయన ఫోకస్‌ పెట్టారని తెలిపారు. తెలంగాణ బుక్‌ ట్రస్ట్‌ సెక్రటరీ కె. చంద్రమోహన్‌ మాట్లాడుతూ.. పీవీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. టీవీ5 ఎడిటర్‌ వైజే రాంబాబు మాట్లాడుతూ.. మంచి మిత్రున్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కిషోర్‌ రెడ్డి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఓ పత్రికకు సీజీఎం స్థాయికి ఎదగటం.. పీవీలో వృత్తి నిబద్ధతకు నిదర్శనమన్నారు. పీవీ సతీమణి జ్యోతి మాట్లాడుతూ.. తమ అనుబంధాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో నవతెలంగాణ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్రాంచ్‌ మేనేజర్‌ జావిద్‌, విధాత డిజిటల్‌ మీడియా ఎడిటర్‌ తాళ్లూరి జగన్మోహన్‌, సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గం కో కన్వీనర్‌ కారం పుల్లయ్య, డీసీసీబీ మాజీ చైర్మెన్‌ యలమంచిలి రవికుమార్‌, భద్రాచలం ఎంఈఓ సమ్మయ్య, సీపీఐ(ఎం) భద్రాచలం మండల కార్యదర్శి గడ్డం స్వామి, తదితరులు పాల్గొన్నారు.