బాల్యం బంగారం వంటిది. అమూల్యమైన రత్నరాశుల ఖజానా వంటిది. తలపుకు వచ్చినకొద్దీ, మనసు పులకరిస్తుంది. మనిషికి ఎంతటి మతిమరుపు వున్నా, నిన్ననే తిన్న వంటకం ఏదో గుర్తుకు రాకున్నా, 50 ఏళ్ల కిందటి బాల్యం, బాల్యంతో అనుసంధానించబడిన, ఊరు పరిసరాలు, ఇల్లు, ఆనాడు అనుభూతించిన సంఘటనలు, తారసపడిన వ్యక్తులు ఈ నాటికే మనసులో పచ్చగా పరిమళిస్తూనే వుంటాయి.
Agnes aruold foster అనే అమెరికన్ రచయిత తన నోస్టాల్జియా అనే గ్రంథంలో బాల్య స్మృతుల గురించి ఇలా అంటారు… Nostalgia is never a simple yearvung for the past, or for a period of time… is is a re coustruction of past to aligu with current values… an act of retrieval that selects soure good fits.
‘మాల్గుడి’ అనే స్వప్న గ్రామాన్ని సృష్టించి, అక్కడి వీధులు, పూరిళ్లు, పెరళ్లు, వీధుల కూడళ్లలో ప్రతిష్టించిన ఆంగ్లేయుల విగ్రహాల గురించి వివరంగా ‘మాల్గుడి డేస్’ రచయిత ఆర్.కె.నారాయణ్ (1906- 2001) ఇలా అంటాడు.. The material available to a story writer in india is limit less. అవును, అందునా బంగారం లాంటి బాల్యం గురించి చెప్పాలంటే ఏ రచయిత అయినా ఉత్సాహం చూపుతాడు. యదార్థ సంఘటన సమాహారం ఒక కారణం. నాటి గురించి నేటి పాఠకులకు ఆనాడు అలా వుండేది అని పాఠకులను విస్మయపరుస్తూ చెప్పడం మరో కారణం.
ఆర్.కె.నారాయణ్ లాగా తెలుగు సాహిత్యంలో ఒక్కో ప్రాంతపు గ్రామాలపై, ఆ గ్రామాలలో రచయిత ఇన్‌వాల్వ్‌మెంట్‌పై ఎన్నో రచనలు వచ్చాయి. అమరావతి కథలు, మా వేములవాడ కథలు, గోదావరి కథల రచయితలు ఆయా గ్రామాలను, వ్యక్తులను, సంఘటనలను వాటిలో తమ అనుబంధాలను తెలుగుపాఠకులకు పరిచయం చేసి, తమను తాము, కథావస్తువుని శాశ్వతం చేశారు. అలాంటి గట్టి ప్రయత్నమే రచయిత్రి, ప్రసిద్ధ కథా సంపుటి ‘నల్ల సూరీడు’తో మంచి పేరు తెచ్చుకున్న శ్రీమతి రోహిణి వంజారి తమ ‘విజయ మహల్ సెంటర్’ లో చేశారు.
నెల్లూరు టౌన్ విజయ మహల్ టాకీస్ సెంటర్ పరిసరాలను, వాటి చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబాల్లోని చాలీచాలని ఆర్థిక వనరులు, సర్దుబాటులను అక్షరీకరించి విజయ మహల్ సెంటర్‌కు శాశ్వతత్వాన్ని చేకూర్చారు.
రచయిత్రి అనుభవాలు, ఆరాటాలు ఆస్పిరేషన్స్, అచీవ్‌మెంట్స్‌ల సమాహారమే ఈ 21 కథలు, నిజానికి వీటిని కథలు అనాలో యదార్థ సంఘటన చిత్రణ కనుక చరిత్ర అనాలో పాఠకులే నిర్ణయించుకోవాలి. ఎక్కడా ఎచ్చులకు పోలేదు. అతి సహజమైన సంఘటనలు కనుక చదువరుల మనసులను కట్టుకుంటాయి. నేటి యువతకు నాటి జీవితాలను తెలుపుతాయి. పరిణత వయస్సులు ఈ కథలతో తమ అనుభవాలని బేరీజు వేసుకుంటాయి. ఎన్నో సామ్యాలను కనుక్కుంటారు.
పావలా (రూపాయలో నాలుగోభాగం, రూపాయి కంటే తక్కువ విలువ కల నాణేలు ఇప్పుడు చలామణిలో లేవు. ద్రవ్యోల్బణ వెల్లువలో రూపాయి కంటే తక్కువ విలువ గల కాసు, బేడ, పావలా, అర్థణాలు కొట్టుకుపోయాయి.) నాణెం మురుగు కాలువతో పడితే పోనీలే అనుకోకుండా దొరికే దాకా, చేయి పెట్టి మురుగు కాలువ అంతా తోడుతా వుండే కాలం గురించి తెలుసుకుంటాం. ఈ వొజ్రం ఇలువ’ లో మరో జీవిత సత్యం రచయిత్రి నాన్న చెబుతాడు. ‘ఈ రోజు పావలా అని వదిలేస్తే రేపు పది రూపాయలు పోగొట్టుకుంటుంది’ అన్న జీవిత సత్యాన్ని నాటి జీవన తత్వాన్ని రచయిత్రి తన తండ్రి ద్వారా మనకు చెబుతుంది. అన్ని కాలాలకూ పనికి వచ్చే జీవన సత్యం ఇది!
చదివి వదిలేయడం కాదు, నేటి జీవన విధానంలో కూడా పనికి వచ్చే పరమార్థం!
‘మానవత్వం’ అన్న తత్వాన్ని కర్పూరదీపం అన్న కథలో దొడ్డెత్తే నరసమ్మ యెడల ప్రవర్తించిన తీరులో తెలుసుకుంటాం. దసరా పండుగ రోజులో తాగుబోతు రమణుడి చేత శవం వేషం వేయించి అడుక్కున్నా, చివరాకరికి రమణుడు నిజంగా శవమనడం, శ్మశానానికి తీసుకువెళ్లడం ఎంతటి విచిత్ర యాదృచ్ఛికం అని అనిపించకమానదు.
అమ్మా నాన్నలు తండ్రి కూతురి యెడల కనబర్చే ప్రేమ తల్లి ప్రదర్శించే విస్తువులోని మమత ఇరుగు పొరుగు, సహాధ్యాయులు, రూతమ్మ టీచర్, బడి అక్కకు జవరం వస్తే ఆలూరి డాక్టర్ (ఆర్.యంపి) దగ్గరకు వెళ్లిన వైనం అక్కడి పేషెంటు జనం దసరా వేషాలు, ఊరేగింపులు, మహిమగల ఉంగరాలు గజ్జి తామరకు అశ్వినివారి మలాము, మైకు ప్రకటనలు, సునీలు తప్పిపోవడం, చిన్నారుల చిన్ని ప్రపంచంలో నటుడు చిరంజీవి ఒక్కటేనేమిటి నాటి ప్రపంచాన్నే ఎత్తి చూపారు రచయిత్రి రోహిణి వంజారి.
కథల్లోని నిజాయితీ పాఠకుడిని కట్టిపడేసేస్తుంది. ఎక్కడా ఎచ్చులకు పోకుండా (పఠనీయత పెంచడానికి కల్పనలు వుంటే వుండొచ్చు. బేసిక్ ఫాక్ట్స్ టాక్ట్‌తో చిత్రీకరించిన తీరుకు పాఠకులు ఫిదా అయిపోతారు) రాసిన తీరుకు ఆరాధనాభావం కలుగుతుంది.
తెల్లగౌను పసుపు రంగులోకి మారి ఒక్క రెట్ట బుంగ ఊడిపోయే వేలాడుతుండడం (23) ఒక చోట కాలు నిలవకుండా తిరగడం (21) బీడీని గోడకు రుద్ది, ఆర్పి మిగిలిన ముక్కను చెవిలో దోపుపోవడం (26), రోజా రంగు గోపాల్ పళ్లపొడి, ఒక్క చుక్క నీళ్లతో తడిపి వేలుకు అద్దుకోవడం, రవంత మింగటం (27) లాంటి వర్ణనలు సినిమా చూపెడతాయి. పాపకారు (పాప్‌కార్), సోమాసాలు (సమోసాలు) కళ్లెదుటే కదలాడుతాయి. ఇక్కడే పాఠకుడు కథల్లో కనెక్టు అవుతాయి. తమను తాము కథల్లో చూసుకుంటారు. బహుశా ఇదే రచయిత్రి ‘ట్రంప్‌కార్డు’ అయింది.
నాటి సాంఘీక పరిస్థితులు, అసమానతలు అయినా, మరుగుపడని మానవత్వం కర్పూరదీపంలో కనుగొంటాం. Quid pro quo ను సైన్సు రికార్డు కొబ్బరి చట్నీ లో కనిపిస్తుంది. నాటి జాతరలు మొక్కులు, క్షుద్రదేవతల పూజలు ‘గంగరాయి సెట్టుకింద…’ లో తెలుసుకుంటాం.
విశాలాక్షి మాసపత్రికలో (సింహభాగం) 2021లో పబ్లిక్ అయిన కథలకు పుస్తక రూపం ఇచ్చిన ఈ 21 కథలు, కథల్లాంటి అనుభవాలు ప్రతి అనుభవం వెనుక నేటితరం కూడా నేర్చుకోదగ్గ పాఠాలు, రచయిత్రి తన ప్రతిభనంతా రంగరించి రచించిన అపురూప చిత్రాలు, వర్ణనతోనే బొమ్మలు గీచి, మరువలేనంతగా మనసులో తిష్టవేస్తాయి ఈ కథల్లాంటి యదార్థాలు.
విజయ మహల్ సెంటర్ (కథలు)
రచన : రోహిణి వంజారి
వెల: 200
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.
– కూర చిదంబరం, 8639338675