కవిత్వం రాయడానికి వస్తువు ఏదైతే బాగుంటుందని, ఏ దుక్పథం లోంచి ఈ కవిత వెళ్తే పాఠకులకు చేరుతుందని రకరకాల ఆలోచనలు కవిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి. ఏది కవిత్వం చేయాలో, ఏది కవిత్వం చేయకూడదో తెలియని తనంలోకి కూడా కూరుకుపోతుంటారు.
వాస్తవానికి కవిత్వం చేయడానికి మన నిత్యజీవిత సంఘర్షణ సరిపోతుంది. మనజీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతీ సందర్భం అందరి జీవితాల్లో వెలుగు చూస్తుంది. నేను అనేది సమాజానికి ప్రతిబింబం. సమాజమనేది నేనుకు ప్రతిబింబం. ఈ కోవలోనే నేనును సమాజంగా ప్రతిబింబింపజేస్తూ రహీమొద్దీన్ సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో విరివిగా కవిత్వం రాసి అందరి దష్టిని ఆకర్షించాడు. ఈ కవి రాసిన ‘నిప్పులగుండం’ కవిత ఆంధ్రజ్యోతి సండే బుక్‌లో వచ్చింది. ఎండను వస్తువుగా చేసుకొని రాసిన ఈ కవిత నిర్మాణపరంగా విలక్షణమైన కవితగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ కవితను మనం అవలోకిద్దాం.
కవితను శీర్షిక పరంగా చూసినపుడు కవితకు పెట్టిన పేరు చక్కగా సరిపోయింది. ఎండతీవ్రతను తెలియజేయడానికి ‘నిప్పులగుండం’ అనే పేరు పెట్టి, అడుగు బయటపెడితే కాళ్ళు బొబ్బలెక్కుతున్న నేటి పరిస్థితులకు ఉదాహరణను చూపినట్టుగుంది. శీర్షిక నేటి వాతావరణ దుస్థితిని, ప్రకతిలో రోజురోజుకు పెరుగుతున్న మార్పులను తెలియజేస్తుంది. హెచ్చరికలను జారీ చేస్తుంది. రాబోయే రోజుల సుడిగుండాలను ఊహించి కాళ్ళకింద లేపనం రాయచూస్తుంది. కవిత ప్రారంభ వాక్యాలు చూస్తే స్తబ్దతకు లోనయిన స్థితి కనబడుతుంది.
బంధిస్తున్న కాలపు సంకెళ్ళు మనిషి జీవనవిధానాన్ని ఎంతలా కబళిస్తున్నాయో చూపిస్తాయి. కరోనా కాలం నాటి సంగతులు మనకు గుర్తే. ఎక్కడికి వెళ్ళకుండా, ఎవరిని తాకకుండా నరకం అనుభవించిన రోజులు మనకు అనుభవమే. అలాంటి భయానక స్థితి ఇప్పుడు ఎండరూపంలో మనిషిని వెంటాడుతుంది. ఎండను తట్టుకోలేక మనిషి ఎటూ కదలని పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాడన్న విషయం ఎత్తుగడలో ప్రయోగించిన వాక్యాల ద్వారా అర్థమవుతుంది.
”గొలుసులు కనబడవు
వాటి శబ్దమూ వినబడదు
కాళ్ళను మాత్రం కదలనివ్వవు”
రెండవ యూనిట్ కు వచ్చేసరికి కవి పశుపక్ష్యాదుల స్థితిగతులను మదిలోకి తెస్తాడు. గూటిలోనే ఉంటూ కదలలేకుండా ఆహారం లేక మాడిపోతున్న పావురాల దీనస్థితిని కళ్ళముందుంచుతాడు. ఈ స్టాంజాలో ఏమి చేయాలో తోచని పరిస్థితిని చెప్పటం కోసం ”పావురాలు మెదడులోని ఆలోచనలను తింటాయి” అని చేసిన ప్రయోగం కవితను ఇంకో మెట్టు ఎక్కించింది. మూడవ యూనిట్లో కాలం స్థంబించిపోయిందని చెప్పడానికి కవి చేసిన మరో ఆలోచనాత్మక ప్రయోగం దశ్యరూపకమైనది. ”ముడుచుకున్న కుక్కపిల్ల డొక్కలో పైకి కిందికి ఊగుతూ ఉంటుంది” అంటూ నేటి కాల ముఖచిత్రాన్ని మన మనసులలో ముద్రిస్తాడు.
నాలుగవ స్టాంజాలో ఎండ దుకాణం యజమానులను దెబ్బ తీస్తుందని, రోడ్లు ఖాళీ అయి వెలవెలబోతున్నాయని కవి ఆర్థికపరమైన దష్టికోణంతో రాశాడు. ఎండకు, సంపాదనకు విలోమాను పాత నియమాన్ని ఆపాదిస్తూ ఎందరో ఆలోచనలకు దగ్గరయ్యాడు. ఐదవ యూనిట్ లో ఎండను లెక్కచేయకుండా కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా రెక్కలు ముక్కలు చేసుకొని బతుకీడుస్తున్న శ్రమజీవన పోరాటం గుర్తుకొస్తుంది. ఆకలికి, అన్నానికి మధ్య దూరం ఎంత నడిచినా తరగదన్న ఒక్క వాక్యం దేశం ఇంకా అభివద్ధి చెందుతూనే ఉందన్న సోయిని కలిగిస్తుంది. ఇంకెంత కాలమయినా దేశం ముందడుగు వేయలేదన్న వ్యంగ్యాత్మక భావన మనసును లోతుల్లోనుంచి కెలుకుతుంది. కవి రాసిన ఆ వాక్యాల క్రమాన్ని పరిశీలిద్దాం.
”గొంతు ఎండిపోతున్న చెమట చుక్కలకు
ఎంతకూ నీటికుండ దొరకదు
ఆకలికి, అన్నం ముద్దకు మధ్య దూరం
ఎంత నడిచినా తరగదు”.
ఏడవ యూనిట్ లో నీడకు మనిషి లక్షణాలను ఆపాదిస్తూ ఫర్సోనిఫికేషన్ అనే టెక్నిక్‌ను వాడుకున్నాడు. ఎండ కారణంచేత గూడు చెదిరిన పిట్ట లను గుల్ల బారిన వాటి జీవితా లను తెలియపరుస్తూ ముగింపులో జీవితానికి, వత్తి పనులకు మధ్య ఉండే విడదీయరాని అనుబంధాన్ని ఓ సందేశం రూపంలో కూర్చాడు. ఎండ తాకిడికి గురయి కుప్పకూలుతున్న ముఖాలు కవి చెప్పినట్టుగా తోపుడు బండ్లు కాక ఇంకేమవుతాయి. దేశం ముఖం వెలగాలంటే ముందు ఇళ్ళ ముఖం వెలగాలి. రోడ్ల ముఖాలు వెలగాలి.
కవి వెలుగును కాంక్షిస్తూ ఈ కవితను ముగించటం వల్ల రాస్తున్న కవిత పట్ల కవికున్న స్పష్టతేంటో అర్థమవుతుంది. ఇది ఎండకు సంబంధించిన కవితా వస్తువే కావచ్చు కానీ నిస్సహాయతను, ఒంటరితనాన్ని , పీడింపబడుతున్న వ్యవస్థలకు నిదర్శనంగా తీసుకుని చదువుకున్నప్పుడు ఈ కవిత మరో రూపంలో దర్శనమిస్తుంది. కవితలో కవితాంతర్ముఖ ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఈ కవికి చుట్టూ తిరుగుతున్న జీవితమే అనేక ఏకైక ప్రపంచం.
నిప్పుల గుండం
గొలుసులు కనబడవు వాటి శబ్దమూ వినబడదు కాళ్ళను మాత్రం కదలనివ్వవు రెక్కలు విరిగిన పావురాలు మెదడులోని ఆలోచనలను తింటూ అక్కడికక్కడే తిరుగుతూ ఉంటాయి నెత్తురు గడ్డకట్టిన కాలం ముడుచుకున్న కుక్కపిల్ల,డొక్కలో పైకీ కిందకీ ఊగుతూ ఉంటుంది రెప్ప వేయడం మరిచిన దుకాణం నడవలేని అవిటి రోడ్డు బహుశా ఎవరి కోసమో! అదేపనిగా ఎదురుచూస్తుంటాయి గొంతు ఎండిపోతున్న చెమట చుక్కలకు ఎంతకూ నీటికుండ దొరకదు ఆకలికి, అన్నం ముద్దకు మధ్య దూరం ఎంత నడిచినా తరగదు గుల్ల ఎముకల పిట్ట కోసం దాని గూటిలో పిల్లల కోసం చెట్టుకింద నీడ నీరసంగా జోగుతూ సాయం చేయమని సాయంత్రానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నది ఈ రోజు ఇంటి ముఖం వెలిగిపోతుందో, మలిగిపోతోందో బతుకు తోపుడు బండి ఇల్లు చేరితే గానీ తెలువదు.
– రహీమొద్దీన్, 9010851085
– తండా హరీష్
8978439551