– గ్రూప్ దశ మ్యాచ్‌లకు ఫిట్‌గా లేడు
– చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడి
– ముగిసిన ఆసియా కప్ క్యాంప్
బెంగళూర్ : ఆసియా కప్ ముంగిట భారత క్రికెటర్ల ఆరు రోజుల శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. బెంగళూర్ శివారులోని ఆలూర్‌లో జరిగిన క్రికెటర్ల క్యాంప్‌లో భారత ఆసియా కప్ జట్టు సన్నద్ధత కాగా.. నేడు రోహిత్‌సేన కొలంబోకు బయల్దేరి వెళ్లనుంది. ఆసియా కప్ క్యాంప్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. కెఎల్ రాహుల్ ఆరంభ దశ మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదని ‘బాంబ్’ పేల్చాడు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లోనే ఉండి ఫిజియో వద్ద శిక్షణ కొనసాగించనున్న కెఎల్ రాహుల్ సూపర్ 4 మ్యాచుల ఆరంభానికి జట్టుతో చేరతాడు. సెప్టెంబర్ 4న రాహుల్ ఫిట్‌నెస్ పరీక్షకు వెళ్లనుండగా.. నివేదిక ఆధారంగా ఎన్‌సీఏ చీఫ్ రాహుల్‌ను శ్రీలంకకు పంపించే విషయంలో సరైన నిర్ణయం తీసుకోనున్నారు.
రెండు మ్యాచులకే దూరం! : ‘కెఎల్ రాహుల్ చాలా బాగా కోలుకుంటున్నాడు. జట్టు కోణంలో.. అతడు కేవలం రెండు మ్యాచులకు మాత్రమే దూరమవుతున్నాడు. రాహుల్ మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు, వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఎటువంటి సమస్య లేదు. కానీ ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. రానున్న రోజుల్లో ఎన్‌సీఏలో మ్యాచ్ సిములేషన్స్‌పై దృష్టి పెడతాడు. రెండు మ్యాచ్‌ల అనంతరం రాహుల్ టీమ్ సెలక్షన్‌కు అందుబాటులోకి వస్తాడని అనుకుంటున్నాం. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ సైతం ఉంది. దీంతో పెద్దగా కంగారు పడటం లేదు. రాహుల్, శ్రేయస్‌లు అనుభవం కలిగిన క్రికెటర్లు. ఎంతో క్రికెట్ ఆడారు, ఫిట్‌నెస్ సాధించి వచ్చారు. ఇప్పుడు తగినంత మ్యాచ్ టైమ్ ఇవ్వటమే మా ప్రాధాన్యం’ అని ద్రవిడ్ చెప్పారు.
గాయాల దెబ్బ : ‘బ్యాటింగ్ లైనప్‌లో నం.4, నం.5 స్థానాలపై ఎక్కువగా చర్చ జరుగుతుంది. దీంతో భారత్‌కు ఆ స్థానాల్లో స్పష్టత లేదనే అభిప్రాయం కలుగుతుంది. కానీ ఆ స్థానాల రేసులో ఉన్న క్రికెటర్లు ఎవరో నేను 18-19 నెలల కిందటే చెప్పేవాడిని. కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు ఈ రెండు స్థానాల కోసం మా పరిశీలనలో ఉన్న ఆటగాళ్లు. కానీ ఈ ముగ్గురు క్రికెటర్లు రెండు నెలల వ్యవధిలో గాయాల బారిన పడ్డారు. గాయాలైనప్పుడు.. కొత్త వారితో ప్రయత్నం చేస్తాం. కొంతమందిని రొటేట్ చేశాం. ఆ ముగ్గురులో కనీసం ఇద్దరు ఆటగాళ్లు ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వచ్చారని’ భారత మాజీ కెప్టెన్ రాహుల్ తెలిపాడు.
బుమ్రా రాక సంతోషం : ‘జశ్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావటం సంతోషం. గత రెండేండ్లుగా బుమ్రాను ఎంతగానో మిస్ అయ్యాం. ఐర్లాండ్ పర్యటనలో ప్రసిద్ కృష్ణతో కలిసి బుమ్రా నాలుగు ఓవర్ల స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. ఆసియా కప్‌లో మరింత మెరుగు పడేలా చూస్తాం. ప్రపంచకప్‌కు సిద్ధమయ్యేందుకు భారత్‌కు పూర్తిగా నెల రోజుల సమయం ఉంది. పేస్ విభాగంలో చాలా ఆప్షన్లు ఉన్నాయి. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో జట్టులోకి ఎంపిక కాకపోయినా..అవసరాన్ని బట్టి జట్టులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది’ అని రాహుల్ ద్రవిడ్ అన్నారు.