రైల్వే కూలీగా రాహుల్‌

 Rahul is a railway laborer– ఎర్ర షర్టు, చేతికి బ్యాడ్జి, తలపై లగేజీ
– ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌లో కాంగ్రెస్‌ అగ్రనాయకుడి హల్‌చల్‌
– కార్మికులు, కూలీలు పడుతున్న ఇబ్బందులు వినడానికే : కాంగ్రెస్‌
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌లో హల్‌చల్‌ చేశారు. సామాన్లు మోసే రైల్వే కూలీలను కలుసుకున్నారు. కాసేపు వారిలాగే రైల్వే కూలీగా అవతారం ఎత్తారు. ఎర్ర షర్టు ధరించి, చేతికి బ్యాడ్జితో తలపై లగేజీని ఎత్తుకొని ముందుకు కదిలారు. ఈ సందర్భంగా రైల్వే కూలీలు, కార్మికులు, ఆయనను చుట్టుముట్టారు. ”రాహుల్‌ గాంధీ జిందాబాద్‌” నినాదాలతో ఆయనతో పాటు ముందుకు కదిలారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ”ఈ రోజు(గురువారం) ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌లో ప్రజా నాయకుడు రాహుల్‌ గాంధీ లగేజీని మోసే కూలీల(పోర్టర్‌లు)ను కలిశారు. ఇటీవల రైల్వే స్టేషన్‌లోని పోర్టర్లు రాహుల్‌ను కలవాలని కోరుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఈరోజు రాహుల్‌ అక్కడికి చేరుకుని వారి మాటలు విన్నారు. భారత్‌ జోడో ప్రయాణం కొనసాగుతుంది” అని పార్టీ ‘ఎక్స్‌’లో స్పష్టం చేసింది.రాహుల్‌ కూలీగా మారి లగేజీని మోస్తున్న వీడియోను కాంగ్రెస్‌, ఆ పార్టీ అభిమానులు, మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న పోస్టులు కనిపించాయి. గతంలోనూ ఆయన బైక్‌ మెకానిక్‌లు, లారీ డ్రైవర్లు, రైతులు, ఇతర రంగాల కూలీలు, కార్మికులను కలిసి ఇలాగే బాధలను పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు.