న్యూఢిల్లీ : మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దొంగలందరికీ మోడీ ఇంటిపేరే ఎందుకు ఉంటోందో… అంటూ 2019 ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పరువు నష్టం దావా వేశారు. ఈ ఏడాది మార్చి 23న సూరత్ కోర్టు ఈ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేండ్ల జైలు శిక్ష విధించింది. తీర్పు రావడం, ఆ మరుసటి రోజు అంటే మార్చి 24న ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడటం అంతా చకచకా జరిగిపోయాయి. దోష నిర్ధారణపై స్టే ఇవ్వాలంటూ రాహుల్ గుజారాత్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. కాగా, సుప్రీంకోర్టు కూడా రాహుల్ శిక్షపై స్టే విధించేందుకు నిరాకరిస్తే ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నాయని, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాహుల్‌కు ఉండదని న్యాయవర్గాలు చెబుతున్నాయి.