రాహుల్‌ పరువునష్టం కేసు విచారణ..ఆగస్టు 4కి వాయిదా

– గుజరాత్‌ ప్రభుత్వానికి,
– పూర్ణేష్‌ మోడీకి సుప్రీం నోటీసులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పరువు నష్టం కేసులో గుజరాత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 4కు వాయిదా వేసింది. ప్రతివాదులు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ ఈశ్వరభారు మోడీ, గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. సూరత్‌ కోర్టు తీర్పును సమర్థిస్తూ గుజరాత్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. పరువు నష్టం కేసు దాఖలు చేసిన పూర్ణేశ్‌ మోడీకి, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 4న జరుగుతుందని తెలిపింది.
విచారణ సందర్భంగా జస్టిస్‌ గవారు మాట్లాడుతూ, తన తండ్రికి, సోదరునికి కాంగ్రెస్‌ పార్టీతో అనుబంధం ఉందని, తాను ఈ విచారణ నుంచి తప్పుకుంటానని అన్నారు. తన తండ్రి కాంగ్రెస్‌ సభ్యుడు కాకపోయినప్పటికీ, ఆ పార్టీతో ఆయనకు అనుబంధం ఉందన్నారు. సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్విని ఉద్దేశించి మాట్లాడుతూ ”సింఘ్వి మీకు కాంగ్రెస్‌తో నలభయ్యేండ్లకుపైగా అనుబంధం ఉంది. మా సోదరుడు ఇంకా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు. నేను ఈ పిటిషన్‌పై విచారణ జరపాలని కోరుకుంటున్నారా? నిర్ణయం తీసుకోండి” అన్నారు.రాహుల్‌ గాంధీ తరఫున వాదనలు వినిపిస్తున్న అభిషేక్‌ మను సింఘ్వి మాట్లాడుతూ, ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రతివాదుల తరఫు సీనియర్‌ న్యాయవాది మహేష్‌ జఠ్మలానీ కూడా తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. దీంతో విచారణ ప్రారంభం అయింది. సింఘ్వి వాదనలు వినిపిస్తూ రాహుల్‌ గాంధీ 111 రోజుల నుంచి బాధపడుతున్నారని, ఓ పార్లమెంటు సెషన్‌ను కోల్పోయారని, మరో సెషన్‌ను కోల్పోబోతున్నారని ధర్మాసనానికి తెలిపారు. వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయని చెప్పారు. లోక్‌సభ సభ్యత్వానికి రాహుల్‌ గాంధీని అనర్హుడిని చేయడాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ప్రతివాదుల వాదనలను కూడా తాము వింటామని, తాత్కాలిక ఉపశమనాన్ని మంజూరు చేయలేమని తెలిపింది. రాహుల్‌ అభ్యర్థనను నిరాకరిస్తూ గుజరాత్‌ హైకోర్టు సుదీర్ఘమైన తీర్పును ఇచ్చిందని వ్యాఖ్యానించింది. 100 పేజీలకుపైగా సుదీర్ఘంగా తీర్పు ఉందని, ఇలాంటివి గుజరాత్‌ కోర్టుల్లోనే ప్రత్యేకంగా చూస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.