వయనాడ్‌లో రాహుల్‌ ఓటమి ఖాయం

వయనాడ్‌లో రాహుల్‌ ఓటమి ఖాయం– జోస్యం చెప్పిన మోడీ
– ఏప్రిల్‌ 26 తర్వాత యువరాజు ఎక్కడికి వెళ్తారోనంటూ ఎద్దేవా!
ముంబయి: వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ ఓడిపోవడం ఖాయమని ప్రధాని మోడీ జోస్యం చెప్పారు. ఏప్రిల్‌ 26 తర్వాత యువరాజు ఎక్కడికి వెళ్తారోనని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. మొదటి దశలో ఎన్డీయేకు ఏకపక్షంగా ఓట్లు పడినట్టు తెలుస్తోందన్నారు. ”అమేథీలో ఓడిపోయిన కాంగ్రెస్‌ యువరాజు.. ఇప్పుడు వయనాడ్‌లోనూ ఓడిపోనున్నారు. ఏప్రిల్‌ 26 (వయనాడ్‌ పోలింగ్‌) తర్వాత సురక్షిత స్థానం కోసం ఆయన వెతుక్కోవాల్సి ఉంటుంది” అని అన్నారు. ఆ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఉద్దేశించి పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. విపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన కొందరు నేతలు లోక్‌సభను వదిలి, రాజ్యసభకు వెళ్లిపోతున్నారన్నారు. వారికి ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలనాపరమైన సమస్యలు చక్కదిద్దేందుకు ఈ పదేండ్లు కేటాయించానని, ఇంకా ఎంతో పని చేయాల్సి ఉందని తెలిపారు. ఇండియా బ్లాక్‌కు నాయకుడంటూ లేరని, దాంతో దేశ భవిష్యత్తును ఎవరికి అప్పగించాలో ప్రజలకు తెలియడం లేదన్నారు.