రైల్వే లైన్‌ అలైన్మెంట్‌ మార్చాలి

–  కేంద్ర మంత్రికి బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
డోర్నకల్‌ – మిర్యాలగూడ బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైన్‌ అలైన్‌మెంట్‌ను మార్చాలని బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారంనాడాయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌కు లేఖ రాసారు. ప్రతిపాదిత అలైన్‌మెంట్‌ వల్ల ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు, రైతులకు తీవ్ర ఇబ్బంది, నష్టదాయకంగా ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనికి బదులు మోటమర్రి – విష్ణుపురం మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ప్రతిపాదిత డోర్నకల్‌ – మిర్యాలగూడ కొత్త బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైన్‌ వల్ల ఖమ్మం రూరల్‌ మండలం జాన్‌బాద్‌ తండా, బోడా వీరతండా, దారేడు, గుండాల తండా, గుడూరుపాడు, ఎం. వెంకటాయపాలెం, అరేకోడు, అరేంపుల, బారుగూడెం, పొన్నెకల్‌, మద్దులపల్లి, తెల్దారుపల్లి, ముదిగొండ మండలం లక్ష్మీగూడెం, మేడేపల్లి, ధనియాగూడెం, కట్టకూర్‌, నేలకొండపల్లి మండలం అరేగూడెం, ఆచర్లగూడెం, కోనాయిగూడెం, నేలకొండపల్లి, బోదులబండ, పైనంపల్లి గ్రామాలు ప్రభావితం అవుతాయని వివరించారు. కోట్ల రూపాయలు విలువైన భూములు, పేదల గహాలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ప్లాట్లు కోల్పోయి, ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు.