– మితిమీరుతున్న కన్సల్టెంట్ల జోక్యం
– దారి మళ్లుతున్న నిధులు
న్యూఢిల్లీ : బాలాసోర్ ప్రమాదం తర్వాత భారతీయ రైల్వేల ప్రతిష్ట కొంత మసకబారింది. అయితే గత దశాబ్ద కాలంగా చేపట్టిన భద్రతా చర్యల కారణంగా రైల్వే ప్రమాదాల సంఖ్య 131 నుండి 34కు తగ్గింది. కానీ కొంతకాలంగా రైల్వేలో ప్రయాణికుల భద్రతపై అధికారులకు శ్రద్ధాసక్తులు తగ్గినట్లే కన్పిస్తోంది. సాధారణంగా రైల్వే బోర్డు విధానపరమైన మార్గదర్శకాలు జారీ చేస్తే వాటిని అమలు చేయడంలో జోన్లు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. భద్రత, ఆపరేషన్స్ వంటి కార్యకలాపాలలో మాత్రం బోర్డు జోక్యం అనివార్యం. కేంద్ర ప్రభుత్వంతో పాటు రైల్వే మంత్రి కూడా సంస్థాగతమైన ప్రాధాన్యతలను నిర్దేశించుకుంటారు. ప్రభుత్వాలు మారినప్పుడు ఈ ప్రాధాన్యతలు పెరుగుతుంటాయి. అయితే ఇవన్నీ ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేవే అయినప్పటికీ అమలు విషయంలో మాత్రం అలసత్వం కన్పిస్తోంది.
2014కు ముందు రోజువారీ కార్యకలాపాలలో రైల్వే మంత్రి పెద్దగా జోక్యం చేసుకునే వారు కాదు. కానీ ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అనుభవం లేని కన్సల్టెంట్లు రైల్వే మంత్రికి సలహాదారులుగా మారారు. అధికారులు ఇచ్చే సలహాలను సైతం పెడచెవిన పెట్టి విధానపరమైన నిర్ణయాలలో జోక్యం చేసుకుంటున్నారు. స్వేచ్ఛగా చర్చించే వాతావరణం కూడా కరువైంది. విధాన నిర్ణయాలన్నీ కేంద్రీకృతమయ్యాయి. ముందుగా బోర్డు స్థాయిలో ప్రారంభమైన జోక్యం ఆ తర్వాత జోన్లు, డివిజన్ల స్థాయికి విస్తరించింది. అధికారులను కించపరచడం, వారి మాటకు విలువ ఇవ్వకపోవడం నిత్యకృత్యమైంది. అధికారులను రైల్వే మంత్రి బహిరంగంగా మందలిస్తుంటే ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు సమీక్షా సమావేశాలలో భద్రతా పరమైన విషయాలకు కేటాయిస్తున్న సమయం బాగా తగ్గిపోతోంది. ఈ విమర్శలు, ఆరోపణలు అవాస్తవమని అనుకున్నా భద్రతకు కేటాయిస్తున్న నిధులు రానురానూ బక్కచిక్కి పోతున్నాయి.
నిధుల కేటాయింపును పెంచాలని రైల్వే శాఖ పదేపదే కోరుతున్నప్పటికీ ప్రభుత్వ గ్రాంట్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. దీంతో ఆ శాఖ రుణ సేకరణ జరుపుతోంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు చేపట్టాలని సూచిస్తోంది. భద్రత కోసం రైల్వే శాఖ మూడు వేర్వేరు నిధులను నిర్వహిస్తోంది. అయితే వాటికి సరిపడినంతగా కేటాయింపులు జరపకపోవడం తో భద్రత గాలిలో దీపంలా మారింది. భద్రతకు కేటాయింపులు తగ్గించడంతో పాటు కేటాయించిన నిధులను సైతం ప్రాజెక్టుల అమలుకు మళ్లిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం భద్రతా చర్యలపై తగినంత దృష్టి కేంద్రీకరించకపోతే రాబోయే రోజులలో మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది.