వాన కబురు

 పలు జిల్లాలకు భారీ వర్షసూచన
– వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
– రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో భారీ వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నైరుతి రుతుపవనాలు అన్నదాతలకు వాన కబురును పంపాయి. ఖమ్మం గుమ్మంలో అడుగుగిడిగిన రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రెండు రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి చెందే అవకాశమున్నాయి. తెలంగాణమీదుగా కిందిస్థాయి నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 40 డిగ్రీలకు పడిపోయాయి. పలు జిల్లాల్లో వచ్చే నాలుగైదు రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించిన ఆ జాబితాలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, కొమ్రంభీం అసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలున్నాయి. 25,26 తేదీల్లో కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికను విడుదల చేసింది. రాబోయే 48 గంటల పాటు హైదరాబాద్‌ పరిధిలోనూ వాతావరణం మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి.
307 ప్రాంతాల్లో వర్షం
నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రంలో గురువారం రాత్రి 10:30 గంటల వరకు 307 ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వానలు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో 9.7 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. ఆ తర్వాత నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్‌ మండలం నెల్లికల్‌లో 7.0, సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం అలంగాపురంలో 6.45 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. 90 ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది.