వర్షార్పణం

– టీమిండియా ఇన్నింగ్స్‌ తర్వాత ఎంతకీ తగ్గని వాన
– రద్దు చేసిన ఫీల్డ్‌ అంపైర్లు
– ఆసియాకప్‌లో ఇరు జట్లకు చెరో పాయింట్‌
– టాప్‌ ఆర్డర్‌ విఫలం.. ఆదుకున్న మిడిలార్డర్‌
– రాణించిన ఇషాన్‌ కిషన్‌, హార్ధిక్‌
– 266 పరుగులకు భారత్‌ ఆలౌట్‌
భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య వన్డే మ్యాచ్‌పై ఎంతో ఆసక్తి నెలకొన్నది. ఇరు దేశాల అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూశారు. ఇందుకు ఆసియా కప్‌ టోర్నమెంటు ఆ అవకాశాన్ని తీసుకొచ్చింది. ఇటు ప్రత్యక్షంగా గ్రౌండ్‌లో, టీవీల్లో చూద్దామనుకొని క్రికెట్‌ అభిమానులు సిద్ధమయ్యారు. టాస్‌ గెలిచిన ఇండియా బ్యాటింగ్‌ దిగింది. అయితే, భారత ఇన్నింగ్స్‌ తర్వాత వర్షం ఎంతకీ తగ్గకపోవటంతో మ్యాచ్‌ను ఫీల్డ్‌ అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరొక పాయింట్‌ను కేటాయించారు.
న్యూఢిల్లీ: శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన భారత్‌-పాక్‌ వన్డే మ్యాచ్‌కు వరణుడు ఆది నుంచే ప్రమాద సంకేతాలు పంపుతూ వచ్చాడు. కొంత వర్షం తగ్గటంతో అంపైర్లు మ్యాచ్‌ నిర్వహణకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాంటింగ్‌ను ఎంచుకున్నాడు. ఎట్టకేలకు మ్యాచ్‌ మొదలైనా భారత టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(11), శుభ్‌మన్‌ గిల్‌(10)లు తక్కువ పరుగులకే అవుట్‌ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన విరాట్‌ కోహ్లి(4), అయ్యర్‌(14), జడేజా(14) కూడా ఎక్కువ పరుగులు చేయలేక చతికల పడ్డారు. దీంతో భారత్‌ తక్కువ పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత జట్టు కనీసం 200 పరుగులైనా దాటుతుందా అనే అనుమానం, ఆందోళన అభిమానుల్లో కలిగింది.
ఊతమిచ్చిన మిడిలార్డర్‌
అయితే, మిడిలార్డర్‌ బ్యాటర్లు రాణించటంతో జట్టు 200 పరుగులను దాటగలిగింది. ఇషాన్‌ కిషన్‌(82), హార్ధిక్‌ పాండ్యా(87)లు చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో టీమిండియా చెప్పుదగిన స్కోరును చేయగలిగింది. తక్కువ పరుగులకే ఆలౌట్‌ అవుతుందనుకున్న భారత జట్టుకు మిడిలార్డర్‌ జీవం పోయటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వారు కూడా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. రవీంద్ర జడేజా(14), శార్దూల్‌ ఠాకూర్‌(3), కుల్దీప్‌ యాదవ్‌(4), జస్‌ప్రీత్‌ బుమ్రా(16), మహ్మద్‌ సిరాజ్‌(1) త్వరత్వరగా అవుటవటంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లు ముగియకుండానే ఇన్నింగ్స్‌ప ముగించింది. 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్‌ అయింది. పాక్‌ బౌలర్లు రాణించటంతో భారత్‌ తక్కువ పరుగులకే పరిమితమైంది. షాహిన్‌ ఆఫ్రిదీ(4 వికెట్లు), నసీమ్‌ షా(3 వికెట్లు), హరీస్‌ రౌఫ్‌(3 వికెట్లు) లు చక్కటి బౌలింగ్‌తో భారత బ్యాటర్లను కట్టడి చేయగలిగారు.
మధ్యలో వర్షం
భారత్‌ ఇన్నింగ్స్‌ సమయంలోనూ వరుణుడు అడ్డు వచ్చాడు. అయితే ఆ తర్వాత వర్షం ఆగిపోవటంతో భారత్‌ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టాడు. భారత్‌ ఆలౌట్‌ అయిన తర్వాత వర్షం మొదలైంది. ఎంతకూ వర్షం తగ్గలేదు. దీంతో ఫీల్డ్‌ ఎంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ దక్కింది.
చరిత్ర సృష్టించిన ఇషాన్‌-హార్దిక్‌ జోడి
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లు కిషన్‌-హార్దిక్‌ పాండ్యాలు ద్వయం సరికొత్త చరిత్రను సృష్టించింది. ఆసియా కప్‌లో ద్రవిడ్‌(82)- యువరాజ్‌సింగ్‌(47)లు 2004లో శ్రీలంకపై ఐదో వికెట్‌కు అత్యధికంగా 133 పరుగులను జోడించారు. ఇప్పుడు ఆ రికార్డును కిషన్‌,హర్ధిక్‌లు 138 పరుగుల భాగస్వామ్యంతో చెరిపివేశారు. అలాగే, వన్డే క్రికెట్‌ చరిత్రలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఐదో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన రాహుల్‌ ద్రవిడ్‌-మహ్మద్‌ కైఫ్‌ల రికార్డు(135 పరుగులు)ను కూడా వీరు బద్దలు కొట్టారు.
ఆసియా కప్‌ చరిత్రలో ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన టాప్‌-4 జోడీలు
-ఇషాన్‌ కిషన్‌-హార్దిక్‌ పాండ్యా 2023లో పాక్‌తో మ్యాచ్‌లో 138 పరుగులు
-రాహుల్‌ ద్రవిడ్‌- యువరాజ్‌ సింగ్‌ (2004) – 133 పరుగులు
-ధోని-రోహిత్‌ శర్మ (2008)- పాక్‌తో 112 రన్స్‌
– ధోని-రోహిత్‌ శర్మ (2010)- శ్రీలంకతో 79 పరుగులు