అమెరికా అప్పు పరిమితి పెంచే

– బిల్లును ఆమోదించిన ప్రతినిధుల సభ
న్యూయార్క్‌ : అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ అమెరికా అప్పు పరిమితిని పెంచటానికి ఉద్దేశించిన బిల్లును ఆమోదించింది. అమెరికా దివాళా తీయకుండా రక్షించటానికిగాను ఈ బిల్లును ఆమోదించటం అనివార్యమైంది. 149మంది రిపబ్లికన్లు, 165మంది డెమోక్రాట్లు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా 71మంది రిపబ్లికన్లు, 46మంది డెమోక్రాట్లు వ్యతిరేకంగా ఓటువేశారు. జూన్‌5వ తేదీనాటికల్లా అప్పు పరిమితిని పెంచకపోతే అమెరికా దివాళా తీస్తుందని అమెరికా ఆర్థిక కార్యదర్శి జానెట్‌ యెల్లెన్‌ గతవారంలో హెచ్చరించింది. ఈ బిల్లు చట్టం కావాలంటే ప్రతినిధుల సభతోపాటు సెనెట్‌ కూడా ఆమోదించాలి. అందుకోసం సోమవారం దాకా సమయం ఉంది. 2025 జనవరి1 దాకా అప్పు పరిమితిని ఈ బిల్లు సడలించింది. ఈ బిల్లులో సైనికేతర వ్యయాన్ని పరిమితం చేసేందుకు అనేక చర్యలను సూచిస్తోంది.అప్పు పరిమితిని సడలించే బిల్లును ఆమోదించినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతినిధుల సభ సభ్యులకు తన కృతజ్ఞతలు తెలిపారు. గత శనివారం బైడెన్‌ ప్రతినిధుల సభ స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీతో చర్చలు జరిపి అమెరికా పాలక పార్టీల మధ్య ఒక రాజీ పార్ములాను రూపొందించటం జరిగింది. దాని పర్యవసానంగానే ఈ బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించింది.