వేతనాలు పెంచండి

– 63 ఏండ్ల తర్వాత హాలీవుడ్‌లో సమ్మె సైరన్‌
– ఏఐతో వినోద రంగంలోనూ కలకలం
పారితోషికాలను పెంచకపోగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ)తో తమ జీవితాలపై దెబ్బ కొట్టాలని ఆలోచిస్తున్న హాలీవుడ్‌ స్టూడియోలు, నిర్మాణ సంస్థలపై నటీనటులు, రచయితలు సమ్మె సైరన్‌ మోగించారు.
63 ఏళ్ల తర్వాత హాలీవుడ్‌లో సమ్మె మాట వినిపిం చడం అరుదైన విషయం.
వేతనాల పెంపుతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల భవిష్యత్తులో తమ మనుగడకే ముప్పు వాటిల్లనుందని ‘సాగ్‌’ సభ్యులు ఆందోళన బాట పట్టారు.
హాలీవుడ్‌కు చెందిన ‘సాగ్‌’ (స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌- అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టెలివిజన్‌ అండ్‌ రేడియో ఆర్టిస్టు) అసోసియేషన్‌ శుక్రవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ అసోసియేషన్‌లో లక్షా అరవై వేల మంది నటీ నటులున్నారు. వారిలో టామ్‌ క్రూజ్‌, ఏంజెలినా జోలి వంటి అగ్రశ్రేణి తారలు ఉండటం విశేషం.
‘సాగ్‌’ పిలుపుతో హాలీవుడ్‌లో షూటింగ్స్‌ మొత్తం నిలిచిపోయాయి. ఈ సమ్మెకు సంఘీభావం తెలియజేస్తూ ప్రముఖ దర్శకుడు క్రిష్టోఫర్‌ నోలన్‌ రూపొందించిన ‘ఒప్పెన్‌ హైమర్‌’ ప్రీమియర్‌ షోను ఆ చిత్ర నటీనటులు బహిష్కరించడం సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే,
మే 1వ తేదీ నుంచి ‘రైటర్స్‌ గిల్డ్‌
ఆఫ్‌ అమెరికా’ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె జరుగుతోంది. తమ మేథస్సునంతా ధారబోసి రాసే కథలతో హాలీవుడ్‌ స్టూడియోలు కోట్లకు పడగలెత్తు తున్నాయని, తమకు మాత్రం నామమాత్రపు పారితోషికాలు అందుతున్నాయని రైటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా ఆరోపిస్తోంది.
అటు నటీనటులు, ఇటు రచయితలు ఈ సమ్మెని ఇలాగే కొనసాగిస్తే బోల్డెని హాలీవుడ్‌ చిత్రాల విడుదల వాయిదా పడి, భారీ నష్టాన్ని హాలీవుడ్‌ స్టూడియోలు ఎదుర్కోవాల్సి రావడం ఖాయం.