రైౖతుబంధు రూ.16వేలు వద్దా?

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
రైతుబంధుతో డబ్బు దుబారా చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారని, రైతుబంధు రూ.16 వేలు కావాలా ? వద్దా..? అని సీఎం కేసీఆర్‌ సభికులను ప్రశ్నించారు. వారంతా కావాలంటూ కేకలు వేశారు. శుక్రవారం సాయంత్రం హన్మకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామంలో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, మీకు రైతు బంధు కావాలా..? వద్దా..? మీరే చెప్పాలి.. వినపడుతలేదు.. ఇటు నుండి రావాలే.. రావాలంటే బిఆర్‌ఎస్‌ను గెలిపించండి.. ఎన్నికల తరువాత రైతుబంధును రూ.16 వేలకు పెంచనున్నట్లు చెప్పారు. నేను చెబుతున్న మాటలను మీరు మీ గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు. 50 ఏండ్లు కాంగ్రెస్‌ పాలించిందని, కాంగ్రెస్‌ పాలనలో రైతుల పరిస్థితి ఎలా వుండేది..? ఎరువులు దొరక్క, సాగు నీరు లేక, కరెంటు లేక తీవ్ర సమస్యలుండేవన్నారు. అరూరి రమేష్‌ వర్ధన్నపేట ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో వర్ధన్నపేటలో ఎస్సారెస్పీ కాలువల్లో చెట్లు మొలిచి అధ్వాన్నంగా వుండేవన్నారు. తెలంగాణ వచ్చినంక కాలువలన్నీ బాగు చేసుకున్నామన్నారు. ఇప్పుడు ఐనవోలు, హసన్‌పర్తి మండలాలకు దేవాదుల ప్రాజెక్టు నీరు తీసుకొచ్చినమన్నారు. అరూరి రమేష్‌ ప్రజల మధ్య వుండే మనిషని, ఒకసారి 80 వేలతో, మరోసారి 90 వేల మెజార్టీతో గెలిపించారని, ఈసారి లక్ష ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రూ.160 కోట్లు తీసుకొచ్చి వర్ధన్నపేటను మున్సిపాల్టీ చేశాడన్నారు. రింగ్‌ రోడ్డు కోసం ల్యాండ్‌ పూలింగ్‌ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, అరూరి రమేష్‌ను నేరుగా ఓడించడం చేతకాని వాళ్లు చేస్తున్న పనని, ల్యాండ్‌ పూలింగ్‌ ఏమి వుండదని స్పష్టం చేశారు. ఎన్నికల కోసం వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడే వారి మాటలు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు ఇదే నియోజక వర్గానికి చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరిల ఆశీస్సులున్నాయన్నారు. వర్ధన్న పేట నియోజకవర్గంలో వున్న 42 విలీన గ్రామాల్లో సాదా బైనామాలను రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఎన్నికల అనంతరం ఇస్తామని సీఎం హామినిచ్చారు. రైతు రాజ్యంగా, సంక్షేమ రాజ్యాంగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దుకున్నామన్నారు. ఈసారి ఎన్నికల్లో రమేష్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిం చా లని కోరారు. ఈ సభలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఛీఫ్‌ విప్‌ దాస్యం వినరుభాస్కర్‌, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ డాక్టర్‌ బండా ప్రకాశ్‌, మేయర్‌ గుండు సుధారాణి, వరంగల్‌ ఎంపి దయాకర్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యే నరేందర్‌, డిసిసిబి ఛైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అర్ధాంతరంగా వెళ్లిపోయిన ప్రజలు
సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తుండగానే ప్రజలు అర్ధాంతరంగా లేచి వెళ్లిపోయారు. ముఖ్యంగా మహిళలు ప్రసంగం వినడా నికి శ్రద్ధ కనపరచకపోవడం గమనార్హం. భట్టుపల్లికి మధ్యా హ్నాం 3గంటలకు రావాల్సి ఉండగా, సాయంత్రం 5.10 గం టలకు చేరుకున్నారు. 5.20 గంటలకు ప్రసంగం ప్రారం భించి 5.35 గంటలకు ముగించారు. ఎమ్మెల్యే అరూరి రమేష్‌ భారీ జన సమీకరణ చేసినా, ఎండకు ప్రజలు సభాస్థలిలో కాకుండా రోడ్డుపైనే నిలబడిపోయారు. సీఎం కేసీఆర్‌ ప్రసం గిస్తుండగానే సగం మంది తిరిగి వెళ్లిపోవడం గమనార్హం.