ఆదర్శ యువతి రామతులసి

Rama Tulsi is an ideal young womanపెండ్లి తర్వాత ఆమె జీవితం మారిపోయింది. అయితే చాలా మందిలా కుటుంబా నికే పరిమితం కాలేదు. సమాజానికి కూడా తన వంతు సాయం చేయడం తన బాధ్యతగా భావించింది. ఇప్పుడు పేదలపాలిట కల్పతరువయింది. తన కన్న పిల్లలకే కాదు ఎంతో మంది అనాథలకు తల్లిగా మారింది. ఆదర్శ యువతిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. అమే రామతులసి రామకృష్ణారెడ్డి. సేవ చేయడంలో ఆమెకు స్ఫూర్తి ఎవరో… ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటో ఆమె మాటల్లోనే…
నేను ఆగస్టు 12, 1993లో కడప జిల్లాలోని ఉప్పులూరులో పుట్టాను. మా అమ్మానాన్న రాజమ్మ, పీరారెడ్డి. వీరు వ్యయసాయం చేస్తారు. సొంతూరులోనే స్కూలు చదువు, ఇంటర్‌ పూర్తి చేసి తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను. మాబావ రామకృష్ణారెడ్డితో 2014లో నా పెండ్లి జరిగింది. కడప జిల్లాలోని తెల్లపాడు గ్రామంలో పేదకుటుంబంలో పుట్టారాయన. నిరక్షరాస్యులైన అమ్మా నాన్నలు, పంటలు చేతికి అందని రెండు ఎకరాల పొలం ఉన్న ఆయన విద్యార్ధిగా ఇంటర్‌లో కాలేజీలో టాపర్‌. జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించారు. ట్యూషన్లు చెబుతూ, ఇళ్ళకి రంగులు వేసే పనులు చేసుకుంటూ తన కడుపు నింపుకోవడంతో పాటు ఆకలితో మాడే అన్నార్తులకు అన్నం పెట్టే పెద్ద మనసు ఆయనది. ఇంటర్లోనే వివేకానంద స్వామి పుస్తకాలు చదివి ఆ స్ఫూర్తితో సంఘసేవ మొదలుపెట్టారు. 20 ఏండ్లకు రైల్వే గేట్‌ మాన్‌గా విధులు నిర్వహిస్తున్న స్నేహితులతో కలిసి సంఘ సేవలో చురుగ్గా పాల్గొనేవారు. ఆయనతో పెండ్లి తర్వాత నా ఆలోచనా విధానం, జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. మాకిద్దరు మగపిల్లలు. వివేకానంద, కుషల్‌ కుమార్‌.
ఆ సంఘటనతో…
12 జనవరి 2010లో వివేకానంద ఫౌండేషన్‌ సేవా సంస్థను నెలకొల్పడంతో మా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతమయ్యాయి. ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూసి నేనూ అందులో భాగమయ్యాను. మొక్కలు నాటడం, విజ్ఞాన దీపిక, కలాం-సలాం, సేవాంజలి కెరీర్‌ గైడెన్స్‌ వంటి పుస్తకాలు ప్రచురించి ఆయనతో కలిసి పంచటంతో నా సేవా జీవితం ప్రారంభ మయింది. నేను ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి ఒక అభాగ్యుని ఆరోగ్యం విషమించడంతో చనిపోయారు. ఆ బాధతో రాత్రంతా నిద్రపట్ట లేదు. అప్పటి వరకు రోడ్లపై ఉండే అనాథలను చేతనైన సహాయం చేస్తుండేవాళ్ళం. అలాంటి తరుణంలో ఒక రోజు ఒళ్ళంతా లుకలుకలాడే పురుగులతో ఉన్న దిక్కు మొక్కు లేని ఒక అనాథకు అన్నిరకాల సపర్యలు చేశాము. కానీ అతను చనిపోయాడు. ఈ సంఘటన మా జంటను మరింత బాధపెట్టింది. ఇలాంటి వారి కోసం ఇంకేదైనా చేయాలని నిర్ణయించుకున్నాం. అప్పుడే ఆశ్రమం కట్టాలనే ఆలోచన వచ్చింది.
ఆశ్రమం కోసం…
అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా రక్తం కోసం, అనాథల సేవ కోసం పరిగెత్తుతున్నా ఏదో తెలియని అసంతృప్తి మమ్మల్ని వెంటాడేది. ఆదరణ కరువైనవారికి నీడ కోసం వెంటనే ఆశ్రమం నిర్మించాలి. మేము చేస్తున్న సేవలు చూసి మాజీ ఆర్మీ ఉద్యోగి విద్యార్థన రెడ్డి ఒక ఎకరా స్థలం ఆశ్రమం కోసం దానం చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. అప్పటికప్పుడు దాతలు ఎవరు ముందుకొస్తారు? నిర్మాణం ఇక ఆలస్యం చేయకూడదని నా బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి పనులు మొదలు పెట్టాం. మా సంస్థ గౌరవ సలహాదారులు రాజోళి శ్రీధర్‌ రెడ్డి తమ బంధువుల చేత బోరు వేయించారు. శింగల్‌ రెడ్డి రామకృష్ణారెడ్డి, నరాల శ్రీనివాస రెడ్డి ఇలా చాలా మంది దాతలు తలో చేయి వేసి ఆశ్రమాన్ని తీర్చి దిద్దారు.
కొంత ఆశ్రమం కోసం…
అందరి సహకారంతో చివరకు 2021 జనవరి 12వ తేదీన కడప జిల్లా కాశినాయన మండలంలోని ఓబులాపురం సమీపంలో గల సగిలేరు నది ఒడ్డున వివేకానంద సేవాశ్రమం ప్రారంభించాం. అప్పటి నుండి మా ఇద్దరి జీవితాలు సేవాశ్రమానికే అంకితం. ఏ దిక్కూ లేనివారిని ఆశ్రమంలో చేర్చుకుంటాం. కొడుకులు, కూతుర్లు ఉంటే వాళ్ళకు కౌన్సిలింగ్‌ చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఉండేలా పంపిస్తాం. ఇప్పటి వరకు మా వివేకానంద సేవాశ్రమంలో 70 మంది వరకు సేద తీరారు. మా బావ చేసేది చాలా చిన్న ఉద్యోగం. అయినా మాకు వచ్చే ఆదాయంలోనే కొంత ఆశ్రమ ఖర్చులకు కేటాయిస్తాం. మా పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా!. కరోనా కాలంలో కూడా పదుల సంఖ్యలో మృతదేహాలకు అంత్యక్రియలు చేశాం. ఇలా నా భర్త చేస్తున్న సేవా కార్యక్రమాల్లో నా వంతుగా భాగస్వామి అవుతున్నాను. సమాజానికి చేతైన సాయం, అభాగ్యులకు చేయూత ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను. సేవ చేస్తూ తృప్తి పొందుతున్నాను.

తోచిన సాయం చేయండి
మాట్లాడడానికి నలుగురు మనుషులు, తినడానికి కొంత ఆహారం, కూర్చోడానికి కొన్ని చెట్లు.. చెట్ల కింద అరుగులు, అనారోగ్యానికి మందులు, ఉండడానికి గదులు.. గదిలో మంచాలు. అప్పుడప్పుడు పలకరించడానికి కొత్త మనుషులు. ఇవి ఉంటే చాలు. దాతలు అండగా నిలవడం వల్ల ప్రస్తుతం అవ్వా తాతలకు పైవన్నీ సమకూరాయి. కానీ ఈమధ్య ఎక్కువగా వచ్చే రిక్వెస్ట్‌ ఏంటంటే.. ‘రోడ్డు పక్కనో, గుడి బయటనో, తెలిసిన వారి ఇంట్లోనో పూర్తిగా మంచానికి పరిమితమైన వారు ఉన్నారు. వారి నుంచి వచ్చే దుర్వాసన భరించలేకున్నాం లేదా వారి బాధ చూడలేకున్నాం. వారిని చేర్చుకోండి’ అని అడుగుతున్నారు. వారిని తెచ్చి ఆరోగ్యంగా ఉన్న వారిమధ్య ఉంచితే వీరు కూడా ఇబ్బంది పడతారు. దానికంటే వారి పరిస్థితి చూసి మాకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని ఆందోళన చెందుతారు. అందువల్ల వారిని ఆశ్రమంలో చేర్చుకోలేక పోతున్నాం. అలాగని వదిలేయడానికి మనసు ఒప్పుకోలేకపోతోంది. అందుకే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆశ్రమ ప్రహరీకి ఆనుకొని ఉన్న మనకే చెందిన ఖాలీ స్థలంలో దాదాపు పదిమందికి సరిపడా ఒక షెడ్‌, బాత్రూమ్‌ నిర్మించాలని సంకల్పించుకున్నాం. అలాంటి వారిని చేర్చుకొని మూడు పూటలా భోజనం అందించి కనీసం రోజుకొక సారైనా వారితో ప్రేమగా మాట్లాడి వారి చివరి రోజులు హాయిగా గడచిపోయేలా ప్రణాళిక చేస్తున్నాం. కనుక మీకు తోచిన సహాయం చేయాలనుకునేవారు 8897292237 నెంబర్‌కు గూగుల్‌ పే/ ఫోన్‌పే చేయగలరు.
– రామతులసి

– అచ్యుతుని రాజ్యశ్రీ