నవతెలంగాణ-గోవిందరావుపేట
వీరపనేని రామదాసు, వెంకటసుబ్బమ్మ దంపతుల ఆశయాల స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలు ముందుకు సాగాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి అన్నారు. ఆదివారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో తీగల ఆదిరెడ్డి అధ్యక్షతన వీరపనేని రామదాసు, వెంకటసుబ్బమ్మ 3వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు అంబాల పోషాలు జెండా ఆవిష్కరించారు. అనంతరం మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. రామదాసు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన నాటి నుంచి తుది శ్వాస వరకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేశారని తెలిపారు. గోవిందరావుపేట మండలంలో రైతు సమస్యలతోపాటు లక్నవరం కాలువ సమస్య పరిష్కారానికి, గిట్టుబాటు ధర కోసం నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్మించారన్నారు. ఆయనతో పాటు ఆయన భార్య వెంకటసుబ్బమ్మ సైతం మహిళా ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. కానీ నేడు కొంత మంది రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం దేశంలో మతోన్మాద మంటలు లేపుతున్నారన్నారు. మణిపూర్‌లో ఇద్దరు కుకీ మహిళపై క్రిస్టియన్ పేరుతో నగంగా ఊరేగించి లైంగికదాడికి పాల్పడి వారికి దారుణంగా హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రోజురోజుకూ పేదరికం పెరిగిపోతోందని, ఇంటి స్థలాలు కూడా లేక ప్రజలు ఇబ్బంది పడుతు న్నారన్నారు. మరోపక్క కార్పొరేట్ శక్తుల ఆదాయాలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయని, వారికి మోడీ ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని తెలిపారు. రామదాసు ఆశయసాధన కోసం వారి కుటుంబ సభ్యులు నేటికీ మండలంలో పేద పిల్లలందరికీ నోటు పుస్తకాలు అందిస్తున్నారన్నారు. రామదాసు స్ఫూర్తిగా మతోన్మాద పార్టీ బీజేపీపై భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. కార్య క్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు బీరెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్, జిల్లా కమిటీ సభ్యులు పొదిళ్ల చిట్టిబాబు, ఎండీ దావూద్, రామదాసు కుటుంబ సభ్యులు వీర పనేని డాంగే, వీరపనేని కృశ వౌ, వీరపనేని పాణి, చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ అజ్మీరా లక్ష్మీ పాల్గొన్నారు.