సీఎం మాట తప్పటం వల్లే రవీందర్‌ మృతి

– బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హోంగార్డులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ అమలు చేయనందు వల్లే హోంగార్డు రవీందర్‌ మృతి చెందాడని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. పోలీసు శాఖలో 17 ఏండ్లుగా సేవలు అందించిన అతడు తన ఉద్యోగం రెగ్యులర్‌ కాదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, మృత్యువుతో పోరాడి చనిపోయాడని పేర్కొన్నారు. హోంగార్డులను రెగ్యులరైజ్‌ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ తన హామీని అమలు చేయలేదని తెలిపారు. వారి కష్టాలు, కనీళ్లు ఈ నియంత పాలకులకు పట్టవని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి, ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘మాజీ ఐపీఎస్‌ అధికారిగా, మీ కుటుంబంలో ఒకడిగా చెబుతున్నా..రాష్ట్రంలో హోంగార్డులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు.. పోరాడి హక్కులు సాధించుకోవాలి’ అని ఆయన సూచించారు. రాష్ట్రంలో 20,000 మంది హోంగార్డుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి బీఎస్పీ పోరాడుతుందని తెలిపారు.