దిగ్గజ ప్రయివేటు బ్యాంక్‌లపై ఆర్‌బీఐ కొరడా

RBI whip on giant private banks– ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రాకు జరిమానా
– నిబంధనల అమల్లో విఫలం
– బ్యాంక్‌ డైరెక్టర్లకు సులభంగా రుణాలు..!
ముంబయి : ప్రయివేటు రంగంలోని విత్త సంస్థలు నిబంధ నల అమల్లో విఫలమవుతున్నా యి. ఇటీవల పేటియం పేమెంట్‌ బ్యాంక్‌కు జరిమానా విధించిన రిజర్వ్‌ బ్యాంక్‌..తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ లపై కొరడా ఝులిపించింది. ఈ రెండు దిగ్గజ ప్రయివేటు విత్త సంస్థలు రెగ్యులేటరీ నిబంధనలు పాటిం చడంలో విఫలం అయినందుకు మంగళవారం భారీ జరిమనా విధించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున జరిమానా వేసింది. ”బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం-1949లోని సెక్షన్‌ 20, సబ్‌ సెక్షన్‌ (1), సెక్షన్‌ 6లోని సబ్‌ సెక్షన్‌ (2), సెక్షన్‌ 8 ప్రకారం రుణాల అడ్వాన్స్‌లు, ఇతర చట్టబద్ధమైన నిబంధనల అమలులో ఐసీఐసీఐ బ్యాంకు విఫలమైంది. బ్యాంకు డైరెక్టర్లలో ఇద్దరికి గల కంపెనీలకు రుణాలు మంజూరు చేయడంలో నిబంధనలను ఉల్లంఘిం చింది.” అని ఆర్‌బిఐ వెల్లడించింది. ”బ్యాంకులకు ఔట్‌ సోర్సింగ్‌ సర్వీసులు అందిస్తున్న సంస్థల ప్రవర్తనా నియామవళి, మార్గదర్శకాలను కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ విస్మరించింది.. తమ సర్వీస్‌ ప్రొవైడర్‌ పనితీరుపై వార్షిక సమీక్ష నిర్వహించడంలోనూ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ విఫలమైంది. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ కోటక్‌ మహీంద్రా బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సర్వీసులు అందించడంలో విఫలమైంది.” అని ఆర్‌బీఐ తెలిపింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు మాత్రమే రెండు బ్యాంకులకు జరిమానా విధించామని పేర్కొంది. ఖాతాదారుల లావాదేవీలకు ఈ జరిమానాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇటీవల పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ కేవైసీ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆ సంస్థకు రూ.5.39 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.