మనసంతా చిరాగ్గా, చికాగ్గా ఉన్నప్పుడూ,
హదయం బరువెక్కి – వెక్కి వెక్కి ఏడవాలనుకున్నప్పుడు…
గుండె ఆగిపోతుందేమో అన్నప్పుడూ ఆలోచనలన్నీ హ్యాంగ్ అయినప్పుడూ
జ్ఞాపకాల ‘విండో’ ఓపెన్ చేస్తా!
బాదరాబందీ లేని బాల్యం – రెటీనా ‘వాల్ పేపర్’ లా ప్రత్యక్షమవుతుంది.
జానా బెత్తెడు జీతంతో లాగుతోన్న జీవితం కంటే
బెత్తం దెబ్బలు తిన్నరోజులే హాయనిపిస్తుంది.
కాకుల్లా పొడుచుకుని తినే ఇప్పటి సహచరులకంటే
‘కాకెంగిలి’ తిన్న స్నేహబంధమే గొప్పదనిపిస్తుంది.
గతం ‘ఫోల్డర్’ లో ‘సేవ్’ చేసిన ‘డాక్యుమెంట్ల’ పరిమళం చుట్టుముడుతూ
మనోఫలకం ‘డ్రైవ్’ ని ‘రీఫ్రెష్’ చేస్తాయి.
అంతే!.. ముఖం ‘డెస్క్ టాప్’ మీద చిరునవ్వు డౌన్లో’డ్’ అవుతుంది.
వర్తమానంలోని అవమానాలు ‘వైరస్’ లా అవరోధాలు అవుతుంటే
భరింపరాని అనుమానాలు ఊపిరినాపేస్తుంటే
నా ఆశలని రీచార్జ్ చేస్తుందీ!…ఉత్తేజాన్ని అందిస్తుంది !..
ఊసులకి సేద తీరుస్తుంది – నా జ్ఞాపకాల కిటికీ
ఎప్పటికీ – ఏనాటికీ!!
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, 8008577834