రియల్‌ ఎస్టేట్‌ ఇబ్బందుల్లో ఉంది..సీఎస్‌కు వినతి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశం గురువారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయములో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన జరిగింది. క్రెడారు, నారెడ్కో, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌, కార్మిక శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సభ్యులు సీఎస్‌కు విన్నవించారు. వాటిని తర్వగా పరిష్కరించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రస్తుత మాస్టర్‌ప్లాన్‌లోని కొన్ని అంశాలు రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయనీ, కొత్త మాస్టర్‌ప్లాన్‌ రూపొందించే వరకు మున్సిపల్‌ శాఖలో కమిటీ వేసి ప్రస్తుత మాస్టర్‌ ప్లాన్‌లోని అంశాలను మార్చాలనీ, ఇతర పరిశ్రమల మాదిరిగానే నిర్మాణ స్థలంలో తాత్కాలిక వాటర్‌ కనెక్షన్‌ కూడా ఇవ్వాలని ప్రతినిధులు సూచించారు. భవన నిర్మాణ అనుమతితో పాటు టీఎస్‌బీపాస్‌ కింద బోర్‌వెల్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు.