రెడ్‌ అలర్ట్‌..

– వచ్చే మూడు రోజులూ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
– ఆరెంజ్‌ అలర్ట్‌ జాబితాలో పలు జిల్లాలు
– సోమవారం 940 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
– 12 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను బీఅలర్ట్‌ చేసింది. మూడు రోజులకుగానూ 12 జిల్లాలకు రెడ్‌ హెచ్చరికను విడుదల చేసింది. ఆయా జిల్లాల్లో పలుచోట్ల భారీ, అతి భారీ, అత్యంత భారీ, కుండపోత వర్షాలు పడే సూచనలున్నాయని హెచ్చరించింది. ‘పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొంది. రానున్న 12 గంటల్లో మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో ఉపరితల ఆవర్తనం మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో నెలకొని ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, చాలా చోట్ల భారీ నుంచి అత్యంత భారీలు వానలు కూడా పడే సూచనలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో సోమవారం రాత్రి 10 గంటల వరకు 940 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 10.5 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో అత్యధికంగా 7.6 సెంటీమీటర్ల వర్షపాతం, సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురంలో 7.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట, రంగారెడ్డి, మంచిర్యాల, హైదరాబాద్‌, ఖమ్మం, పెద్దపల్లి, మహబూబాబాద్‌, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలోల పలు చోట్ల భారీ వర్షం పడింది.
25.7.2023
రెడ్‌ అలర్ట్‌ : మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ (భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం)
ఆరెంజ్‌ అలర్ట్‌ : నల్లగొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట(భారీ నుంచి అతి భారీ వర్షాలు)
26.7.2023
రెడ్‌ అలర్ట్‌ : ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌ (భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం)
ఆరెంజ్‌ అలర్ట్‌ : భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ, జనగాం, కామారెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి (భారీ నుంచి అతి భారీ వర్షాలు)
27.7.2023
రెడ్‌ అలర్ట్‌ : రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి (భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు)
ఆరెంజ్‌ అలర్ట్‌ : నల్లగొండ, సూర్యాపేట, మంచిర్యాల, నిర్మల్‌, సిద్దిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌ (భారీ నుంచి అతి భారీ వర్షాలు)