ఎర్ర కోడి – తెల్ల పిల్లి – నల్ల కుక్క

Red Hen - White Cat - Black Dogఅన్నవరం అనే ఊరిలో గోపయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి పక్షులు, జంతువులు అంటే ఎంతో ఇష్టం. అతని ఇంటిలో ఎర్ర కోడి, తెల్ల పిల్లి, నల్ల కుక్క ఉన్నాయి. అవి కలిసి మెలిసి జీవిస్తున్నాయి. యజమాని తమకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి. ఎదురింట్లో ఉన్న సోమయ్యకు ఇవి కలిసి ఉండడం నచ్చేది కాదు. ప్రతిరోజు వీటి స్నేహాన్ని చూసి అసూయ చెందేవాడు. ఎలాగైనా వీటి మధ్య గొడవ పెట్టాలని అవకాశం కోసం ఎదురు చూసేవాడు.
ఒక రోజు గోపయ్య పొరుగూరికి వెళ్ళాడు. వెళ్ళే ముందు ఇల్లు జాగ్రత్త అని కుక్కకు చెప్పి వెళ్ళాడు. ఈ విషయం విన్న సోమయ్య మనసులో దురాలోచన మెదిలింది. మెల్లగా తెల్ల పిల్లి దగ్గరకు వెళ్ళి ”గోపయ్యకు నల్ల కుక్క అంటేనే ఎక్కువ ఇష్టం. పిల్లి, కోడిలు ఊరికే తింటున్నాయి. వాటి వల్ల ఎటువంటి లాభం లేదని నాతో చాలాసార్లు చెప్పాడు” అన్నాడు.
సోమయ్య మాటలు విన్న పిల్లి, కోడి దగ్గరకు వెళ్ళి చెప్పింది. రెండు కలిసి కుక్క దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డాయి. గొడవ పెరిగి పెరిగి ఎవరు గొప్ప అనే స్థాయికి చేరింది.
”నేను ప్రతి రోజూ యజమానిని నిద్ర లేపుతాను. నేనే గొప్ప” గర్వంగా అంది కోడి.
”నేను ఎలుకల బారి నుండి ధాన్యాన్ని కాపాడుతున్నాను. నేను లేనిచో యజమానికి తిండి లేదు” కోపంగా అంది పిల్లి.
కుక్క కొద్ది సేపు మౌనం వహించి ఆ తర్వాత మాట్లాడడం మొదలెట్టింది.
”నేను మీ కంటే గొప్ప కాదు, తక్కువ కాదు. ఈ సృష్టిలో ప్రతి జీవి తన శక్తి మేరకు పని చేస్తూనే ఉంటుంది. అన్ని జీవులు గొప్పవే. ఈ ఇంటిని కాపలా కాసే బాధ్యత నాది కాబట్టి, యజమాని నాకు చెప్పి వెళ్ళాడు. మనుషుల్లో కొందరు మాత్రం తాము చేసే పనులు పక్కనపెట్టి ఇతరుల మధ్య ఎలా తగవులు పెట్టాలా అని కుట్రలు పన్నుతారు. ఇప్పుడు సోమయ్య చేసింది అదే” అన్నది నల్ల కుక్క.
పిల్లి, కోడి తమ తప్పు తెలుసుకున్నాయి. సోమయ్య మాటలు విని దురుసుగా ప్రవర్తించినందుకు కుక్కను క్షమాపణ కోరాయి.
– దుర్గమ్‌ భైతి, 9959007914