బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన రెడ్డి సామాజిక వర్గం

– పదవీ కేటాయింపులో మాట మార్చారని అసహానం
నవతెలంగాణ-కోహెడ : బీఆర్‌ఎస్‌ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం రాజీనామా చేస్తున్నట్లు వైస్‌ఎంపీపీ తడకల రాజిరెడ్డి, రెడ్డి సంఘం నాయకులు తెలిపారు. ఆదివారం మండలంలోని వెంకటేశ్వర ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం రెడ్డిల ఆత్మగౌరవ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛ్కెర్మన్‌ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ ప్రకటించారని ఇంతలోనె దానికి భిన్నంగా మరోక వర్గానికి కేటాయించడంలో ఆంతర్యమేమిటని విమర్శిస్తున్నారు. దీంతో మండలంలోని రెడ్డి సామాజిక వర్గాలలో పలు కేటగిరిలలో ఉన్న తమతమ పార్టీ సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తాము రాజీనామా చేసిన పత్రాలను ఎమ్మెల్యేకు పంపిస్తామని వారు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో ఎమ్మెల్యే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.