ఎలక్ట్రిక్‌ టూవీలర్లపై ప్రోత్సాహకాల తగ్గింపు

కేంద్రం నిర్ణయంపై రెడ్కో చైర్మెన్‌ ఫైర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎలక్ట్రిక్‌ టూ వీలర్లపై కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను కుదిస్తూ గెజిట్‌ జారీ చేసింది. దీన్ని తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివద్ధి సంస్థ (రెడ్కో) చైర్మెన్‌ వై సతీష్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఇప్పటివరకు ఒక్కో ఎలక్ట్రిక్‌ టూవీలర్‌పై రూ.15వేలు ప్రోత్సాహకం ఉండేదనీ, కేంద్ర ప్రభుత్వం దాన్ని రూ.10వేలకు తగ్గించిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు వాహనంధరపై గరిష్టంగా 40 శాతం వరకు ప్రోత్సాహకం ఉండేదనీ, దాన్నిప్పుడు గరిష్టంగా రూ.10వేలు, లేదా వాహనధరలో 15 శాతానికి పరిమితం చేస్తూ కేంద్రం గెజిట్‌ ఇవ్వడం సరికాదన్నారు. ఇది ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనాలనుకున్న వారికి ఇబ్బందిగా మారుతుందనీ, ఈ నిర్ణయాన్ని పునఃస్సమీక్షించాలని మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 2030 నాటికి దేశంలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉండేలా చూస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పారనీ, కానీ క్షేత్రస్థాయి నిర్ణయాలు అందుకు తగినట్టు లేవన్నారు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్నదనీ, ఇలాంటి టైంలో ప్రోత్సాహకాలు కుదించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు మౌలిక వసతులు పెంచడంపైనా కేంద్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదని విమర్శించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సోలార్‌పైనా ట్యాక్స్‌ల భారం మోపిందనీ, ఆ పరికరాలపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచిందన్నారు. సోలార్‌ పీవీ సెల్స్‌ దిగుమతిపై 25 శాతం, సోలార్‌ పీవీ మాడ్యూల్స్‌ దిగుమతిపై 40 శాతం కస్టమ్స్‌ డ్యూటీ వసూలు చేస్తున్నదని వివరించారు. కేంద్రం తన నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కోరారు.