– ఈ నెల 31 వరకు అరెస్టు వద్దు
– ముందస్తు బెయిల్‌పై అదేరోజు తీర్పు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డిని ఈ నెల 31 వరకు అరెస్టు వంటి కఠిన చర్యలు తీసుకోరాదని సీబీఐకి హైకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శనివారం సుదీర్ఘ వాదనలు ముగిశాయి. దీంతో తుది ఉత్తర్వులను ఈ నెల 31న జారీ చేస్తామని జస్టిస్ లక్ష్మణ్ వెల్లడించారు. హైదరాబాద్ ఆస్పత్రిలో అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరుగనుందని, తండ్రి ఇదే కేసులో జైల్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో అవినాష్ తల్లి దగ్గర ఉండాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అవినాష్, సీబీఐ, వివేకా కూతురు సునీతల వాదనలు విన్నామని, తుది ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. అవినాష్‌కు ఎంపీ సీటు ఇవ్వాలని ముందే పేరు ఖరారు చేసినప్పుడు, ప్రచారం కూడా చేసుకుంటున్నప్పుడు ఎంపీ టిక్కెట్ కోసం వివేకాను హత్య చేయాల్సిన అవసరం ఏముందని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. సామాన్యుల కేసుల్లో కూడా విచారణ ఇదే తరహాలో జాప్యం అవుతుందా అని ప్రశ్నించింది. దీనిపై సీబీఐ న్యాయవాది స్పందిస్తూ, కోర్టుల్లో కేసులు వేసి అవినాష్ కాలయాపన చేస్తున్నారని జవాబు చెప్పింది. భాస్కర్‌రెడ్డి, ఉదరురెడ్డిలను కస్టడీలో ఉండగా విచారణ చేసినా ఫలితం లేకపోయిందని తెలిపింది. హత్య జరిగిన రోజు అవినాష్ జమ్మలమడుగు వెళ్లలేదని, ఇంట్లోనే ఉన్నారని ఎలా చెబుతారని హైకోర్టు ప్రశ్నకు ఇప్పుడే ఆ వివరాలు వెల్లడించలేమని సీబీఐ చెప్పింది.