జ్ఞాపిక

మా గూట్లోని
ఈ బుజ్జి మెమొంటో
నా చిన్నప్పుడెప్పుడో
ఎస్సే రైటింగ్‌ పోటీలో
ఎందరో మిత్రులను దాటేసి
నా చేతుల్లోకి వచ్చి వాలిన యాది

ఇత్తడి పూలతో
నగిసీ చెక్కిన ఈ జ్ఞాపిక
నా జ్ఞాపకాల దీపిక
మొదటిసారి
చిగురించిన నా కవితను
మెచ్చి వచ్చిందే..!
ఇప్పుడు నేను అక్షరాలను
పలవరిసస్తున్నానంటే ఈ నిషానీ వల్లే..!

ఇది చూడండి
నా గమ్యాన్ని గుర్తు చేసే
రమ్యమైన గీతిక
కాలాన్ని నిదురపోనియ్యని
మహాకవి చేతుల మీదుగా
స్వీకరించిన
వాడిపోని ఆనందాల వాటిక

వారానికోసారైనా
దీన్ని తుడవందే నాకు తోచదు
చీకట్లో కూడా తళ తళా మెరుస్తుంది.

వివిధ స్మతులు
ఈ ఆకతుల్లో జీవిస్తాయి
ఒకరకంగా ఇవి
కళాకారుల సౌందర్యతష్ణకు
నిదర్శనాలు..

నా కవిత్వానికి మొన్నటి రోజు
ఓ పురస్కారం ఇచ్చారు
నగదు కన్నా
జ్ఞాపికే నాకెక్కువ నచ్చింది.
ఇప్పుడు మెమొంటోల అల్మారిని చూస్తే
ఇంతకంటే సంపద
ఇంకేమున్నది అనిపిస్తుంది

ఓ మెమొంటోలో
పెన్ను బొమ్మని అందంగా చెక్కారు
అందులోంచి మరిన్ని నావైన కవితలు
పుట్టుకొస్తే బాగుండు..!
– నాంపల్లి సుజాత, 9848059893