ప్రముఖ ప్రజావైద్యులు డాక్టర్‌ స్వామి అల్వాల్‌ కన్నుమూత

ప్రముఖ ప్రజావైద్యులు డాక్టర్‌ స్వామి అల్వాల్‌ కన్నుమూత– నవతెలంగాణ సీజీఎం, ప్రజాసంఘాల నేతల నివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రముఖ ప్రజావైద్యులు డాక్టర్‌ స్వామి అల్వాల్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ స్వామి మంగళవారం తుది శ్వాస విడిచారు. మల్లు వెంకటనర్సింహారెడ్డి స్మారక ప్రజావైద్యశాలలో ఆయన గత ఐదేండ్లుగా సేవలందిస్తున్నారు. అంబేద్కర్‌ స్ఫూర్తితో తనకున్న స్థలాన్ని కూడా విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేసి పేదలు, దళితుల పట్ల తన సేవాగుణాన్ని చాటుకున్నారు. డాక్టర్‌ మృతి పట్ల నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనరల్‌ మేనేజర్లు, మేనేజర్లు భరత్‌, శశిధర్‌, నరేందర్‌రెడ్డి,వీరయ్య, విజరుకుమార్‌, రాములు ఆయనకు నివాళులర్పించారు.
స్వామి అల్వాల్‌ మరణం సామాజికోద్యమాలకు తీరని లోటు
ప్రముఖ ప్రజా వైద్యులు, నిస్వార్ధ జీవి, సంఘ సేవకులు, పేదల పక్షపాతి డాక్టర్‌ స్వామి అల్వాల్‌ మరణం సామాజికోద్యమాలకు తీరని లోటని వివిధ ప్రజాసంఘాల నేతలు అన్నారు. మంగళవారం తిలక్‌నగర్‌లోని శతాబ్ది భవన్‌లో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి టి స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ తన 300 గజాల విలువైన స్థలాన్ని పేద ప్రజలకు ఇచ్చారని గుర్తు చేశారు. అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారన్నారు. జీవితాంతం ప్రజాసేవకే అంకితమైన డాక్టర్‌ స్వామి అల్వాల్‌ నేటి తరానికి మార్గదర్శకులుగా నిలుస్తారని చెప్పారు. మహనీయులు సంత్‌గాడ్గే బాబా, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, కారల్‌ మార్క్స్‌ భగత్‌ సింగ్‌ జ్యోతిబాఫూలే, సావిత్రిబాయిఫూలే, వీరనారి ఐలమ్మ వంటి సుమారు 20మంది మహనీయుల విగ్రహాలను నెలకొల్పారని చెప్పారు. మహనీయుల అడుగుజాడల్లో సమాజ మార్పు కోసం కృషి చేశారని కొనియాడారు. ఆయన మరణం దళితులు, పేదలకు తీరని లోటని చెప్పారు. మహేందర్‌, కోట రమేష్‌, గోసుల విజరుకుమార్‌, లక్ష్మయ్య, భూపతి వెంకటేశ్వర్లు, ఎస్వీకే నిర్వహకులు జి బుచ్చిరెడ్డి, ఎన్‌ సోమయ్య తదితరులు డాక్టర్‌ స్వామికి నివాళులర్పించారు.