– మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
– కొత్త ఆఫీసుల ప్రారంభం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం వచ్చాకే సీఎం కేసీఆర్ నేతత్వంలో పంచాయతీరాజ్ శాఖను పునర్వ్యవస్థీకరించామని ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఖైరతాబాద్, ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన టెరిటోరియల్ సీఈ, క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ కార్యాలయాలను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 87 కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేయగా సీఈ, సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాలలో నేడు సంబంధిత అధికారులు బాధ్యతలు తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 237 ఇంజినీరింగ్ కార్యాలయాలు ఉండగా మిషన్ భగీరథతో పాటు ఇతర కార్యక్రమాల ద్వారా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ కార్యకలాపాలు విస్తరించడంతో కొత్త కార్యాలయం ఏర్పాటు చేయాలని దూరదృష్టితో సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్తగా నాలుగు చీఫ్ ఇంజినీరింగ్ కార్యాలయాలు, 12 కొత్త సర్కిల్, 11 డివిజన్లు, 60 కొత్త సబ్ డివిజన్లు నాలుగు రోజుల్లో అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రెండు, వరంగల్, నిజామాబాద్‌లో ఒకటి చొప్పున సీఈ కార్యాలయాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇప్పటికే కొత్త కార్యాలయాల కోసం కింది స్థాయి అధికారులకు పదోన్నతులు కల్పించామని చెప్పారు. దీంతో ఏఈ స్థాయితో పాటు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 740 ఖాళీ అయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే వీటిని భర్తీ చేస్తామని ప్రకటించారు.
పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ పునర్వ్యవస్థీకరణతో అధికారులు, ఉద్యోగులపై బాధ్యత పెరిగిందన్నారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. అధ్యక్షత వహించిన ఇంజినీర్ ఇన్ చీఫ్ ఏజీ సంజీవరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టిమేరకు పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖను పునర్వ్యవస్థీకరించినట్టు చెప్పారు. కొత్తగా వందలాది పోస్టుల రాకతో అధికారులు, ఉద్యోగుల పనితీరును మరింత నాణ్యంగా ఉండటానికి వీలవుతుందని అన్నారు. మంత్రులు దయాకర్‌రావు, హరీశ్‌రావు, ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయా సహకారం ఎనలేనిదంటూ దన్యవాదాలు చెప్పారు. కొత్త పోస్టులు, కార్యాలయాల రాకతో ప్రజల సేవకు మరింత చిత్తశుద్ధితో కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఈ గజం సీతారాములు, రంగారెడ్డి ఎస్‌ఈ సురేశ్‌చంద్రారెడ్డి, ఇంజినీర్లు ముజీబ్, రజిత, నరేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.