విలీనంలో సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించండి

– ప్రభుత్వానికి టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో కార్మిక సంఘాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దానితోపాటే ఆర్టీసీ కార్మికులకు ప్రస్తుతం ఉన్న ఆర్థిక అంశాలను కూడా పరిష్కరించాలని కోరింది. ఈ మేరకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులకు లేఖలు రాశారు. ప్రభుత్వం చేసిన విలీన ప్రకటనను స్వాగతిస్తున్నామనీ, దీనికి సంబంధించి ఏర్పాటైన కమిటీ ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ న్యాయం చేయాలని ఆ లేఖలో ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికులకు రావల్సిన రెండు వేతన సవరణలు, పెండింగ్‌ బకాయిలు, పీఎఫ్‌, సీసీఎస్‌ నిధులు, కారుణ్య నియామకాలు, పెన్షన్‌ సౌకర్యం, స్టాఫ్‌ బెన్వలెంట్‌ అండ్‌ త్రిఫ్ట్‌ ఫండ్‌ (ఎస్‌బీటీ), రిటైర్‌ అయిన కార్మికులకు ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సహా పలు అంశాలను ఆ లేఖలో వివరించారు. విలీన ప్రక్రియ కమిటీ పై సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
ఆర్టీసీ చైర్మెన్‌కు సన్మానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయించడంలో కీలక పాత్ర పోషించిన ఆ సంస్థ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ను బస్‌భవన్‌లో ఉన్నతాధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ తన హయాంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. 43 వేల మంది టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత లభించిందన్నారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మునిశేఖర్‌, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, కష్ణకాంత్‌, చీఫ్‌ మేనేజర్‌(ప్రాజెక్ట్స్‌) విజరు కుమార్‌, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవనప్రసాద్‌, సీఎఫ్‌ఎం విజయపుష్ప, సీసీవోఎస్‌ విజయభాస్కర్‌, సీసీఈ రాంప్రసాద్‌, బిజినెస్‌ హెడ్‌ సంతోష్‌ కుమార్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ఆర్‌ఎంలు శ్రీధర్‌, వరప్రసాద్‌, ఖుస్రోషా ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.